రైతులకు న్యాయం కోసం బళ్లారి బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులకు న్యాయం కోసం బళ్లారి బంద్‌

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

సాక్షి బళ్లారి: కుడితిని ప్రాంత రైతుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ దందాను తక్షణం ఆపేసి భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలు, రైతుల ఆధ్వర్యంలో బళ్లారి బంద్‌ నిర్వహించారు. గురువారం రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో కర్ణాటక ప్రాంత రైతు సంఘం, కుడితిని భూపోరాట సమితి, వివిధ కన్నడ సంఘాలు, రైతు కార్మికులు, సీఐటీయూ, ఏఐకేఎంఎస్‌ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన, ఆందోళన, ర్యాలీలు చేపట్టారు.

గడిగి చెన్నప్ప సర్కిల్‌లో మానవహారం

ఉదయం 6 గంటల నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్‌ వద్దకు రైతు సంఘాల నాయకులు, కార్మికులు చేరుకొని మానవహారం నిర్వహించి, బైటాయించి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 10 ఏళ్ల క్రితం కుడితిని ప్రాంతంలో 12,500 ఎకరాల భూములను వేలాది మంది రైతులతో తక్కువ ధరకే కొనుగోలు చేశారన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పుతామని భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశలు చూపించి భూములను ప్రభుత్వం లాక్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశించిన, నిర్ణయించిన ప్రకారం ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో పాటు రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.

పరిశ్రమల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ దందా

పలు స్టీల్‌ ప్లాంట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చి ప్రస్తుతం ప్రభుత్వం కేఐఏడీబీ ఆధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరలేపిందన్నారు. జిందాల్‌ సంస్థకు తమ భూములను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కుడితిని, వేణివీరాపురం, హరగినడోణి, కొళగల్లు, ఎర్రంగళి, సిద్ధమనహళ్లి తదితర గ్రామాలకు చెందిన రైతులచే స్వాధీనం చేసుకొన్న భూములను దశాబ్ధాలు గడిచినా అటు పరిశ్రమలను నెలకొల్పకుండా ఉండటమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరలేపడం రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జిందాల్‌ సంస్థకు భూములను కట్టబెడితే తాము సహించేది లేదన్నారు.

న్యాయం చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు

రైతులకు ఎక్కువ పరిహారం అందించి తగిన న్యాయం చేయకపోతే పాలకులకు ప్రజలు, రైతులు బుద్ధి చెబుతారన్నారు. దశాబ్దాలు గడిచినా రైతులకు అన్యాయం చేస్తున్న పాలకులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా బళ్లారిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తించారు. స్వచ్ఛందంగా పలు వ్యాపార సంస్థలు, అంగళ్లు, హోటళ్లు, మూసివేసి రైతులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కారు. కార్యక్రమంలో కుడితిని భూపోరాట సమితి ప్రముఖులు యూ.బసవరాజు, జే.సత్యబాబు, గురుశాంత, కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన రైతు సంఘాల నాయకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement