రాయచూరు రూరల్: గత ఐదు రోజుల నుంచి బావి నీరు తాగి 50 మంది అస్వస్థతకు గురైన ఘటన యాదగిరి జిల్లా శహాపుర తాలూకా బీరనూరులో చోటు చేసుకున్న సంగతి విదితమే. కొళాయిల నుంచి తాగునీరు సరఫరా నిలిచి పోవడంతో జల జీవన్ మిషన్ పథకం కింద తవ్విన బోరుబావి నీటిని సరఫరా చేశారు. ఆ నీటిని తాగడంతో అతిసార ప్రబలింది. గతంలో గ్రామస్తులు బోరుబావి నీటిని తాగేవారు. బోరుబావి మరమ్మతులకు గురి కావడంతో కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేశామని గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. గురువారం జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి లవీష్ ఒడెయర్ గ్రామంలో పర్యటించి నీటి సరఫరాపై పరిశీలన చేశారు.
నిందితుల్ని అరెస్ట్ చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. గురువారం ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు భీమన్న, కుమార్ మాట్లాడారు. 15 రోజుల క్రితం నగరంలో ఐపీఎల్ మ్యాచ్ విషయంలో మడ్డిపేటలో జరిగిన ఘర్షణలో కట్టపై కూర్చొన్న దళితుడు రాఘవేంద్రను రాడ్లతో కొట్టారన్నారు. మాజీ నగరసభ సభ్యురాలి భర్త తిమ్మారెడ్డి కుమారుడు మహాలింగరెడ్డి కుటుంబ సభ్యులు ఆదర్శ్, తరుణ్‌లు కలిసి దాడి చేశారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. మాజీ నగరసభ సభ్యురాలి భర్త తిమ్మారెడ్డిపై ఐదు కేసులున్నాయని, రౌడీషీటర్‌పై కేసును నమోదు చేయకుండా ప్రముఖ రాజకీయ నాయకులు పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. 14 మందిలో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలన్నారు.
నేడు పాండురంగ స్వామి ఆలయ వార్షికోత్సవం
బళ్లారిఅర్బన్: గుగ్గరహట్టిలో వెలసిన పాండురంగ స్వామి ఆలయంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆలయం అభివృద్ధి కోసం పాటు పడుతున్న దేవస్థాన సేవా సమితి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


