కూలిన పైకప్పు పెచ్చులు, టీచర్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కూలిన పైకప్పు పెచ్చులు, టీచర్‌కు గాయాలు

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

కోలారు: రాష్ట్రంలో పాఠశాలల భవనాలు అనేకం శిథిలావస్థకు చేరాయి. ఏటా ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలు సద్వినియోగం అవుతున్నాయా, లేదా అన్నది సామాన్య ప్రజలకు తెలియడం లేదు. కోలారు నగరంలోని పాత మాధ్యమిక ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఉపాధ్యాయురాలు యశోద గాయపడింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పైకప్పు నుంచి పెద్ద మొత్తంలో పెచ్చలు ఊడి టీచర్‌ మీద పడడంతో ఆమె గాయపడింది. ఇతర టీచర్లు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ఈ మధ్యనే రూ. 25 లక్షల వ్యయంతో పాఠశాలలో మరమ్మత్తులు చేశారు. ఇంతలోనే కూలిపోవడంపై ఉపాధ్యాయులు సహా స్థానిక ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఏమాత్రం నాణ్యత లేకుండా, తూతూ మంత్రంగా పనులు చేసి, నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి.

అవినీతిని తుడిచి,

అభివృద్ధి చేయండి

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అవినీతి నిర్మూలన, బెంగళూరు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్‌ పాయ్‌.. సీఎం డీకే శివకుమార్‌కి సలహా ఇచ్చారు. డీకే శివకుమార్‌ తమ మార్గదర్శకుడైన మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కంటే మెరుగ్గా పాలన అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. బెంగళూరు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని కోరారు. అవినీతి కారణంగా బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి, ఫుట్‌పాత్‌లు కనుమరుగయ్యాయి, డబ్బులు తింటేనే పని జరుగుతోంది అని ఎక్స్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

బంగారం కోసం..

చెవి కోసేశారు..

మండ్య: మండ్య జిల్లాలోని హలగూరు వద్ద సాగ్య గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న కూలీ శాంతమ్మను మంగళవారం ఉదయం ఇద్దరు దొంగలు కత్తితో బెదిరించి, బంగారు చెవిపోగులను లాక్కొని పారిపోయారు. ఆ దొంగలను సాగ్య–అంకనహళ్లి గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒక బాలుడు ఉన్నాడు. చెవి పోగులను లాక్కునేందుకు వీలుకాకపోవడంతో కత్తితో ఎడమ చెవిని కోయడంతో గాయమై ఆమె విలవిలలాడింది. పోలీసులు నిందితుల నుంచి చెవిపోగులు, 2 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతమ్మను మలవళ్లి ఆసుపత్రికి తరలించారు. దొంగలు సమీప గ్రామవాసులేనని తెలిసింది.

చిన్నారిపై వీధికుక్కల దాడి

బెంగళూరులో దారుణం

యశవంతపుర: బెంగళూరులో మరోసారి వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన ఘటన సహకారనగరలో జరిగింది. ఆదివారం సాయంత్రం సీక్యూఎల్‌ లేఔట్‌లో బాలిక సంగీత (4) అంగడిలో బిస్కెట్లు కొనుక్కోవడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. పాప తల్లిదండ్రులు యాదగిరి జిల్లా చెందిన కట్టడ కూలీ కార్మికులు. ఇంతలో నాలుగైదు కుక్కలు బాలిక మీద పడి తీవ్రంగా కరిచాయి. బాలిక ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు కుక్కను తరిమివేసి చిన్నారిని కాపాడారు. లేకుంటే పెద్ద ఘోరమే జరిగేది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కాగా వైరల్‌ అయ్యాయి. ఆమె కాలు, చేతికీ, ముఖానికీ గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగళూరు ఉత్తర పాలికె అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భారీగా తూటాలు లభ్యం

హుబ్లీ: బెళగావి పారిశ్రమికవాడలో పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తున్న వేళ ఆ చెత్తకుప్పలో 59 తుపాకీ గుండ్లు లభించాయి. కార్మికులు ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ మహంతేష్‌, పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఇందులో 41 గుళ్లు ఒకే రకంగా ఉండగా, మరో 18 వేరేగా ఉన్నాయి. ఘటనతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి. వాటిని పారవేసింది ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement