రాయచూరు రూరల్ : మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సింధనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సింధనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ క్యాంప్‌లో నివాసం ఉంటూ 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలపై బాబు(29) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఘటనపై సోమవారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన సీఐ వీరారెడ్డి మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు.
బేకరీ యజమానిపై దాడి
● పరారీలో ముగ్గురు నిందితులు
హుబ్లీ: బేకరీకి వచ్చిన సందర్భంలో సదరు వినియోగదారుడికి వేగంగా సామాన్లను ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన ముగ్గురు యువకులు బేకరీ యజమానిపై దాడి చేసిన ఘటన హెగ్గేరి బేకరీలో చోటు చేసుకుంది. శంకర దొడ్డమని దాడికి గురైన వ్యక్తి. నిందితులు అతడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనా స్థలానికి పాత హుబ్లీ పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
20న మురికివాడ వాసుల
సమస్యలపై సమావేశం
హొసపేటె: గదగ్‌లో ఈ నెల 20న రాష్ట్ర స్థాయి మురికివాడ వాసుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయనగర జిల్లా స్లం విభాగం కో– ఆర్డినేటర్ యంకమ్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గదగ్‌లోని లయన్స్ క్లబ్‌లో రాష్ట్ర స్థాయి స్లం సమావేశం జరుగనుందని, ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సంబంధిత స్లం విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మురికివాడల ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదన్నారు. ఈ మూడేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ పథకం అమలు కోసం రూ.6200 కోట్లు ప్రకటించగా, విడుదల చేసిన మొత్తం రూ.1000 కోట్లకు కూడా మించలేదన్నారు. మొత్తం 1.80 లక్షల ఇళ్లకు గాను కేవలం 81 వేల ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ నామమాత్రంగా మిగిలిపోయిందన్నారు. గదగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి స్లం విభాగం రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేటర్ నరసింహమూర్తి, డివిజనల్ కో–ఆర్డినేటర్ జనార్ధన్, ఇంతియాజ్ తదితరులు హాజరవుతారని ఆమె తెలిపారు.
టీచర్‌కు దేహశుద్ధి, సస్పెన్షన్
● విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫలితం
సాక్షి, బళ్లారి: బెళగావి జిల్లాలోని చిక్కోడి తాలూకాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది పోయి నిత్యం లైంగికంగా వేధించడంతో పాఠశాల విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై విద్యార్థినుల తల్లిదండ్రులు దాడి చేశారు. తమపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అనుచితంగా తాకుతున్నాడని తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులతో విద్యార్థినులు వాపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. డీడీపీఐ కూడా అక్కడి చేరుకుని వాస్తవాలను పరిశీలించిన తర్వాత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
ఓటరు జాబితాలను సవరించాలి
రాయచూరు రూరల్: ఓటరు జాబితాలో సవరణలకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేత వీరసంగయ్య పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఓటు హక్కు పరిరక్షణలో అర్హులైన వావరి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడితే సమష్టిగా అడ్డుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్లు పేర్ల తొలగింపు వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
15 మోటార్ సైకిళ్లు స్వాధీనం
● ముగ్గురు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్ : నగరంలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ హాస్టల్ ముందు నిలిపిన వాహనాలను బిజినగేర ఆంజనేయ, కమలాపుర ఆకాష్, కార్తీక్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.11.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్‌ఐ బసవరాజ్ నాయక్, శారదలున్నారు.


