ప్రసాద్‌ అబ్బయ్యకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రసాద్‌ అబ్బయ్యకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలి

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌లో రెండో సారి మంత్రివర్గ విస్తరణలో హుబ్లీ–ధారవాడ శాసన సభ్యుడు, దళిత నేత ప్రసాద్‌ అబ్బయ్యకు రాష్ట్ర మంత్రిగా చోటు కల్పించాలని చలువాది మహాసభ డిమాండ్‌ చేసింది. మంగళవారం ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు భీమన్న, కుమార్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రిగా డీ.కే.శివకుమార్‌ను నియమించిన నేపథ్యంలో మంత్రి పదవిని దళితులకు కేటాయించాలన్నారు. 2023 ఎన్నికల సమయంలో ఉత్తర కర్ణాటకలో దళితుల ఓట్లు కావాలని అభ్యర్థించి ప్రధాన పదవులను మాత్రం అగ్రకుల నాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సన్నివేశంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శివకుమార్‌ మంత్రివర్గంలో 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందించిన ప్రసాద్‌ అబ్బయ్యను రాష్ట్ర మంత్రి పదవిని కేటాయించాలన్నారు.

క్యాంటర్‌, ఆర్టీసీ బస్సు ఢీ

ముగ్గురు దుర్మరణం

విజయపురలో దుర్ఘటన

రాయచూరు రూరల్‌ : కేఎస్‌ఆర్టీసీ బస్సు, క్యాంటర్‌ ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో సంభవించింది. మంగళవారం సిమెంట్‌ బస్తాలతో వెళుతున్న కేఏ– 28 ఏఏ– 6792 నంబరుగల క్యాంటర్‌ వాహనం టైర్‌ ఆకస్మికంగా పేలింది. దీంతో అదుపు తప్పి చడచణ తాలూకా లోణ క్రాస్‌ వద్ద ఎదురుగా వచ్చిన కేఏ– 28 ఎఫ్‌– 2468 నంబరుగల బస్సును ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మరణించారు. క్యాంటర్‌ సిమెంట్‌ లోడుతో చడచణ వైపు వెళుతుండగా, ఆర్టీసీ బస్సు చడచణ నుంచి విజయపురకు వెళుతోంది. మార్గం మధ్యలో జరిగిన ఈ ఘటనలో బస్‌ డ్రైవర్‌ హనుమంత చలువాది(30), క్యాంటర్‌ డ్రైవర్‌ అశోక్‌ ఉటగి(25), భార్య రాధ(22) మరణించారు. బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని విజయపుర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సోమేష్‌ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అసత్య అట్రాసిటీ

కేసులతో వేధింపులు

రాయచూరు రూరల్‌: జిల్లాలో అసత్యపు అట్రాసిటీ కేసులతో అగ్ర వర్ణాల వారిని దళిత నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని సింధనూరుకు చెందిన చెన్నబసప్ప ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో వీరప్ప, జాకోబ్‌, హనుమంతులు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా చెక్‌ బౌన్స్‌ కేసు విషయంలో నానారకాలుగా చిత్రహింసలు పెడుతూ అట్రాసిటీ కేసులను పెడతామని బెదిరిస్తున్నా సింధనూరు డివిజన్‌ పోలీసులు వారిపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కులం పేరుతో దూషిస్తూ భయపెడుతున్నా సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌కు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు.

విద్యార్థులు పాఠ్యేతర

అంశాల్లో పాల్గొనాలి

రాయచూరు రూరల్‌: సమాజంలో విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర అంశాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని సమృద్ధ భారత చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు హిరేమట్‌ పేర్కొన్నారు. మంగళవారం బీసీఎం హాస్టల్‌లో దామోదర వీర సావర్కర్‌ జయంతి కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఆయన బాటలో ఉత్తమ నాయకుడుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ వీరేష్‌ నాయక్‌, భారత సేవా దళ అధికారి విద్యాసాగర్‌, రామయ్య నాయక్‌, నాగరాజ్‌, నరసణ్ణలున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement