హొసపేటె: పర్యాటక శాఖ ఎల్లప్పుడూ గైడ్‌ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, విదేశీ భాషా శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని విజయనగర సామ్రాజ్యం, హంపీ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సూచించారు. పర్యాటక శాఖ, హంపీ కన్నడ విశ్వవిద్యాలయం సహకారంతో మంగళవారం హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం భువన విజయ ఆడిటోరియంలో టూరిస్ట్ గైడ్‌ల కోసం నిర్వహించిన విదేశీ భాషా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. విదేశీ పర్యాటకులకు పరిశోధన ఆధారిత, ప్రామాణికమైన చరిత్రను మాత్రమే తెలియజేయాలన్నారు. మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా గైడ్‌లు భాష పైనే కాకుండా డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బుకింగ్‌లు, టూరిస్ట్ యాప్‌ల వాడకంపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. పర్యాటక శాఖ ఎల్లప్పుడూ గైడ్‌ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. కలబుర్గి డివిజన్ పర్యాటక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.తిప్పేస్వామి, కన్నడ హంపీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమశివమూర్తి, హైదరాబాద్ ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తారకేశ్వర్, పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ తళకేరి, హంపీ కన్నడ వర్సిటీ రిజిస్ట్రార్ విరుపాక్ష పూజారహళ్లి, విదేశీ భాషల కో–ఆర్డినేటర్ ఎస్.వై సోమశేఖర్, వివిధ జిల్లాల టూరిస్ట్ గైడ్‌లు హాజరయ్యారు.
జిల్లాధికారిణి కవిత మన్నికేరి


