మంటల్లో ప్రైవేటు బస్సు | - | Sakshi
Sakshi News home page

మంటల్లో ప్రైవేటు బస్సు

Jun 7 2026 8:42 AM | Updated on Jun 7 2026 8:42 AM

శివమొగ్గ: జిల్లాలోని హోసనగర తాలూకాలో, శివమొగ్గ–ఉడుపి సరిహద్దులోని బలేబార్‌ ఘాట్‌ రోడ్డులో శనివారం శ్రీ దుర్గాంబ బస్సు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిపోయింది. ప్రయాణికులు మంటలను గుర్తించి దిగిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. కుందాపుర వైపు వెళ్తున్న బస్సును చండికాంబ ఆలయం సమీపంలో ఆపారు. బస్సులో సుమారు 17 మంది ప్రయాణికులు ఉన్నారు. మళ్లీ బయల్దేరిన కొద్ది క్షణాలకే బస్సులో సెన్సార్‌ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే సైరన్‌ మోగింది. దీంతో డ్రైవర్‌, ప్రయాణికులు గబగబా దిగిపోయారు. క్షణాల్లో బస్సు మొతం కాలిపోయింది.

ఎమ్మెల్యేపై వారెంటు జారీ

దొడ్డబళ్లాపురం: ఒక కేసులో కోర్టుకు పలుసార్లు గైర్హాజరైన బీదర్‌ జిల్లా బసవ కళ్యాణ నియోజకవర్గం ఎమ్మెల్యే శరణు సలగర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. 2023లో బక్రీద్‌ రోజున చట్ట వ్యతిరేకంగా గోహత్యకు పాల్పడ్డారని ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి వారిని ఎమ్మెల్యే బెదిరించారని గతంలో కేసు నమోదైంది. పోలీసులు ఎమ్మెల్యేపై దర్యాప్తు చేసి చార్జ్‌షీట్‌ సమర్పించారు. అయితే ఎమ్మెల్యే శరణు విచారణకు రాకపోవడంతో బెంగళూరు 42వ ఏసీజేఎం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

పోకిరీ వేధింపులకు బాలిక బలి

దొడ్డబళ్లాపురం: ఆకతాయి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావి జిల్లా ఐగళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సిరాజ్‌ కాళె అనే పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు. పీయూసీ చదువుతున్న మరో మతానికి చెందిన బాలిక ఇంటి ముందుకు వచ్చి నిందితుడు రోజూ ఆమెను వేధించేవాడు. ఈ వేధింపులను తట్టుకోలేక బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సౌధ కారిడార్లలో

ఒంటరైన సిద్దు

యశవంతపుర: రాజకీయ అధికారం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం కష్టం. విధానసౌధ వరండాలో సీఎంగా సిద్ధరామయ్య తిరుగుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రుల మార్బలం వెంట ఉండేది. కానీ ఆయన మాజీ కాగానే పరిస్థితి మారింది. సౌధలో రాజ్యసభ ఎన్నికలలో నామినేషన్లకు వెళ్లిన సిద్ధరామయ్య ఒంటరిగా తిరుగుతున్న వీడియోలు వ్యాప్తి చెందాయి. ఎదురుగా వస్తున్న సీఎం డీకే శివకుమార్‌, సిద్దు వైపు తిరిగి చూడకుండానే వెళుతున్న వీడియో ప్రచారమవుతోంది. సిద్దు వెంట ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవటంతో కారిడార్లలో ఒక్కరే తిరుగుతున్న వీడియోను చూసి రాజకీయాలంటే ఇంతేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కూలీల వ్యాన్‌కు ప్రమాదం.. 10 మందికి గాయాలు

శివమొగ్గ: జిల్లాలోని హోసనగర తాలూకా, రిప్పన్‌పేట సమీపంలోని బాలూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారు. శికారిపుర తాలూకాలోని ఓతినకట్టే గ్రామం నుండి ప్రజలను తీసుకువెళ్తున్న బొలెరో పికప్‌ వ్యాన్‌ రిప్పన్‌పేట–ఆనంద్‌పూర్‌ రహదారిపై ముందు వెళ్తున్న క్యాంటర్‌ లారీని ఢీకొట్టింది. బొలెరో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, వాహనంలో ఉన్న చాలా మంది గాయపడ్డారు. స్థానికులు చేరుకుని గాయపడిన వారిని రక్షించి, రిప్పన్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, శివమొగ్గ మెగ్గాన్‌ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారి గుర్తింపు, ఇతర వివరాల కోసం విచారిస్తున్నారు. బాధితులు పనుల కోసం వెళ్తున్న కూలీలుగా అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement