తుమకూరు: చారిత్రక హరళూరు శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. చోళుల కాలపు ఈ ఆలయానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి ఏటా ఉగాది పండుగ తరువాత వీరభద్ర స్వామి జాతర జరపడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటలకు హరళూరు గ్రామస్తులు, భక్తుల సమక్షంలో తేరు ఊరేగింపు సాగింది. స్వామి ఉత్సవమూర్తిని తేరులో కూర్చోబెట్టి జయజయధ్వానాల రథాన్ని లాగారు. రాత్రి భక్తి గాన కచేరీ, కురుక్షేత్ర నాటకం ఆకట్టుకున్నాయి.
కుమార– ఐపీఎస్ కేసులో మధ్యవర్తిత్వం!
శివాజీనగర: రాష్ట్ర లోకాయుక్త ఏడీజీపీ ఎం.చంద్రశేఖర్, కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మధ్య గొడవల కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా పేరును హైకోర్టు సూచించింది. ఓ కేసులో విచారణ జరుపుతున్న తనను బెదిరించారంటూ చంద్రశేఖర్ బెంగళూరు సంజయ్‌నగర ఠాణాలో కేసు పెట్టగా, ఆ కేసును కొట్టివేయాలని కుమారస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. కొంతకాలంగా దీనిపై విచారణ జరుగుతోంది. న్యాయమూర్తి ఎస్.సునీల్‌దత్ యాదవ్ విచారిస్తూ, జస్టిస్ ఓకా మధ్యవర్తిత్వానికి సిఫార్సు చేసి వాయిదా వేశారు.
గర్భిణిపై దాడి..
కవలల మృత్యువాత
దొడ్డబళ్లాపురం: గర్భిణిపై కొందరు దాడి చేయడంతో ఆమె కడుపులో ఉన్న కవల పిల్లలు ప్రాణాలు వదిలిన విషాద సంఘటన హావేరి జిల్లా సవణూరు తాలూకా అల్లిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. మార్చి 28న పవిత్ర లమాణి అనే గర్భిణి అప్పు చెల్లించలేదని ఇంటికి వచ్చిన కొందరు ఆమెను కొట్టారు. కడుపు మీద తన్నడంతో అస్వస్థతకు గురైంది. పవిత్రకు ఈ నెల 7న కాన్పు కాగా కవల పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన కాసేపటికే కన్నుమూశారు. దుండగుల దాడి వల్ల శిశువులు దక్కకుండా పోయారని పవిత్ర కుటుంబ సభ్యులు విలపించారు. వారి ఫిర్యాదు మేరకు సురేశ్ హాలప్ప లమాణి, పరశురామ్ హాలప్ప లమాణి, మహేశ్ లమాణి, సక్కుబాయి అనేవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గోడౌన్‌లో మంటలు.. భారీగా ఆస్తినష్టం
దొడ్డబళ్లాపుర: ఆహార పదార్థాలు నిల్వ చేసే ఓ మాల్ కంపెనీ గోడౌన్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్‌లో వంట నూనె, ఇతర ఆహార పదార్థాల నిల్వలు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది రాత్రి 12 గంటల నుంచి గురువారం ఉదయం వరకూ 10 ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపు చేశారు. గోడౌన్‌లో కరెంటు తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వెలువడినట్లు తెలుస్తోంది. 18ఏళ్ల క్రితం పద్మరాజ్ అనే వ్యకి ఈ గోడౌన్ రూ.20 కోట్ల ఖర్చుతో నిర్మించి ఓ మాల్‌కు బాడుగకు ఇచ్చాడు. కోట్ల రూపాయల సరుకులు బూడిదైనట్లు సమాచారం.
మైసూరులో బస్సు
ఢీకొని మహిళ మృతి
మైసూరు: ప్రైవేట్ బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన మైసూరులోని కేఆర్ సర్కిల్‌లో జరిగింది. మైసూరులోని ఇలవాల సమీపంలోని బాలగంగాధరనాథ స్వామి లేఔట్ నివాసి ఎం.మహాలక్ష్మి (38) మృతురాలు. ఆమె తల్లి గీతతో కలిసి పని మీద సిటీ బస్సులో నగర బస్టాండ్‌కు వచ్చారు. హోటల్‌లో టిఫిన్ తినాలని బస్టాండ్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో కేఆర్ సర్కిల్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకు వచ్చిన ప్రైవేట్ బస్సు మహాలక్ష్మిని ఢీకొంది. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని స్థానికులు కేఆర్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ప్రమాదంలో తల్లి గీత క్షేమంగా బయటపడింది. దేవరాజ ట్రాఫిక్ స్టేషన్ పోలీసులు బస్సును ఠాణాకు తరలించారు.


