యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా బాబా బుడన్‌గిరి సమీపంలోని మాణిక్యధార అనే పర్యాటక ప్రాంతంలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన కేరళ బాలిక శ్రీనంద (16) కోసం పోలీసులు, అటవీ సిబ్బంది, స్థానికులు గాలింపు చేపట్టారు. కేరళ నుంచి టూరిస్టులు బస్సులో వచ్చారు, ఆ సమయంలో బాలిక మిస్సయింది. ఆమె అనుకోకుండా లోయలోకి పడి ఉండవచ్చుని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక తల్లి రోహిణి మాట్లాడుతూ ఆమెకు ఏ ప్రమాదం జరగలేదు, ఎవరో ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో మత్తు మందు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారని విలపించారు. గత 10 ఏళ్ల నుంచి తమ కుటుంబం ఎక్కడా టూర్‌కు వెళ్లలేదు, దీంతో ఎక్కడైనా విహారయాత్రకు వెళ్లాలని ఇక్కడకు వచ్చామని, ఇలా అయ్యిందని తెలిపారు.
పోలీసులకే సవాల్
పోలీసులు డ్రోన్ కెమెరాలతో అడవిలో గాలింపు చేపట్టారు. మాణిక్యధారకు వచ్చిన వాహనాల వివరాలతో పాటు అనుమానం ఉన్న వ్యక్తుల సమాచారంను నేకరిస్తున్నారు. నా కూతురిని వెతికి ఇవ్వండి, ఆమె లేకపోతే నేను బతకలేని అని తల్లి రోదిస్తున్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులకే సవాల్‌గా మారింది. మాణిక్యధారలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
బాలిక జాడ లేక తల్లిదండ్రుల రోదనలు
డ్రోన్ కెమెరాలతో పోలీసుల గాలింపు


