దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో బెళగావికి చెందిన వ్యాపారవేత్తను బెదిరించి రూ.15.45 కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వంకదోత్ శరత్ నాయక్, దేగావత శ్రీపాద నాయక్ నిందితులు. వీరు ఓ కంపెనీ పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చే డబ్బును హైదరాబాద్, గోవా, హరియాణ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 10 బ్యాంక్ ఖతాలకు బదిలీ చేసేవారు. వీరి ఖాతాలలో ఉన్న రూ.1 కోటి డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు.
పదే పదే బెదిరించి..
బెళగావిలోని తిళకవాడికి చెందిన అజిత్ సరాఫ్ అనే వ్యాపారవేత్తకు ఇటీవల కాల్ చేసిన నిందితులు.. తాము సీఐబీ అధికారులమని చెప్పుకున్నారు. మీ పేరుతో రెండు సిమ్ కార్డులు ఉన్నాయి. మీ ఖాతా నుంచి రూ.25 లక్షల మనీ లాండరింగ్ చేసి రూ.5 లక్షలు కమీషన్ తీసుకున్నారు, మీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది.. అని పదే పదే బెదిరించారు. ఇలా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 వరకూ పలు విడతలుగా బాధితుని నుంచి రూ.15.45 కోట్లను ఆన్‌లైన్‌లో తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లో నిందితులను అరెస్టు చేశారు.
బెళగావివాసి డిజిటల్ అరెస్టు కేసు..
హైదరాబాద్‌లో నిందితుల అరెస్టు


