సాక్షి,బళ్లారి: కర్ణాటకలోని హావేరి జిల్లాలో చరిత్రను గురించి తెలిపే అరుదైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. చరిత్రకారులు, పురావస్తు శాఖ తవ్వకాల సందర్భంగా హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా బసలికట్టి గ్రామ సమీపంలో 3200 సంవత్సరాల క్రితం నాటి ఆదిమానవుల సమాధి లభ్యమైంది. రాతి నిర్మాణంతో రూపొందించిన ఈ సమాధి ఆది మానవుల కాలంలో మనుషులు అనుసరించిన అంత్యక్రియల విధానాన్ని ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమాధి నిర్మాణం ప్రత్యేకతతో పాటు దాని వయస్సు కూడా పరిశోధకులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పురావస్తు శాఖ అధికారుల అభిప్రాయం ప్రకారం ఈ సమాధి ద్వారా ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సామాజిక వ్యవస్థ, మరణానంతరం ఆచరించిన విధానాలు, విశ్వాసాలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా అధికారులు లోతుగా అధ్యయనం చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కర్ణాటకలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోనే చారిత్రక నాగరికతలపై మరింత లోతైన అధ్యయనాలకు ఇది దోహదం చేస్తుందని వారంటున్నారు.
తవ్వకాలు మరింత వేగవంతం
ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలు మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం బయట పడిన ఒక సమాధితో పాటు మరిన్ని సమాధులు లేదా పురాతన అవశేషాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ఈ ప్రాంతంలో లోతుగా అధ్యయనం చేస్తూ చరిత్ర ఆధారాలు, పురాతన ఆదిమానవుల జీవిత విశేషాలు, వైవిధ్యాలు, ఆచారాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హావేరి జిల్లా చరిత్ర పుటల్లో నిలిచిపోయే దిశగా ఈ పరిశోధనలు ఉపయోపడనున్నాయని కూడా భావిస్తున్నారు. రాతి సమాధి అందులోనే దాదాపు 3200 సంవత్సరాల కిందటిదని తేలడంతో అప్పటి పద్ధతులు, మనిషి జీవన విధానాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రాతి సమాధి వెనుక ప్రాచీన నాగరికత జాడలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ కాలంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఈ తవ్వకాలు మరింత ఉపయోపడతాయని పురావస్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
తవ్వకాల్లో బయట పడిన పురాతన సమాధి ఇదే
బసలికట్టి వద్ద బయల్పడిన అవశేషాలు
3200 ఏళ్ల క్రితం నాటిదిగా గుర్తింపు
హావేరి జిల్లా చారిత్రక నాగరికత ఖిల్లా
తవ్వకాల్లో బయటపడిన రహస్యాలు
ఆదిమానవులపై లోతుగా అధ్యయనం


