● భయంతో కేకలు వేసిన భక్తులు
హొసపేటె: సింగటలూరులోని వీరభద్రేశ్వర స్వామి జాతరకు ట్రాక్టర్‌లో వెళ్లిన భక్తులు తుంగభద్ర నదిలో చిక్కుకున్నారు. ఈ ఘటన విజయనగర జిల్లా, హడగలి తాలూకాలోని నవలిలో జరిగింది. వివరాలు.. రోడ్డు మార్గంలో వెళ్తే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందనే ఉద్దేశంతో డ్రైవర్ ట్రాక్టర్‌ను తుంగభద్ర నదిలో తీసుకెళ్లాడు. నది మధ్య భాగం చాలా లోతుగా ఉండటంతో ట్రాక్టర్‌లోకి నీరు చేరింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా భక్తులు భయంతో సహాయం కోసం కేకలు వేశారు. అక్కడే ఉన్న జాలర్లు భక్తులందరినీ కాపాడటానికి అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అనంతరం వారు క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను నదిలోంచి బయటకు లాగారు. ట్రాక్టర్ ఉన్న ఒక భక్తుడు ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘మేము డ్రైవర్ మాటలు నమ్మి ప్రమాదం ఉందని తెలిసినా నదిలో ప్రయాణించాం. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డాం. మమ్మల్ని కాపాడిన జాలర్లకు కృతజ్ఞతలు. ఇలాంటి సత్వర మార్గాలను ఎవరూ ఉపయోగించవద్దు’ అని తెలిపాడు.


