వివాహితుడి లివ్-ఇన్ రిలేషన్‌ నేరం కాదు : సంచలన తీర్పు | Allahabad High Court Married Man In Consensual LiveIn Relationship not a Crime | Sakshi
Sakshi News home page

వివాహితుడి లివ్-ఇన్ రిలేషన్‌ నేరం కాదు : సంచలన తీర్పు

Mar 27 2026 4:34 PM | Updated on Mar 27 2026 5:22 PM

Allahabad  High Court Married Man In Consensual LiveIn Relationship not a Crime

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక జంట దాఖలు చేసిన క్రిమినల్ రిట్ పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వయోజనులైన స్త్రీ-పురుషులు పరస్పర అంగీకారంతో సహజీవనం (Live-in Relationship) చేయడం నేరం కాదని స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు మరొక వయోజన మహిళతో కలిసి ఉన్నా, అది చట్టపరంగా నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అనమిక, నేత్రపాల్ అనే జంట తాము వయోజనుల మని, ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తున్నామని కోర్టును ఆశ్రయించింది. కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS)  నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేజే. మునిర్, జస్టిస్ తరుణ్ సక్సేనాల డివిజన్ బెంచ్, పిటిషనర్లకు అనుకూలంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.

అయితే జనవరి 8న అనామిక తల్లి కాంతి, షాజహాన్‌పూర్‌లోని జైతీపూర్ పోలీస్ స్టేషన్‌లో నేత్రపాల్‌పై కేసు పెట్టింది. నేత్రపాల్ తన కుమార్తె అనామిక (18)ను మాయమాటలతో లోబరుచుకుని తీసుకువెళ్లాడని ఆమె ఆరోపించింది.

నైతికత vs చట్టం
న్యాయమూర్తులు జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. "సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవు" అని కోర్టు స్పష్టం చేసింది. నేత్రపాల్ వివాహితుడు అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.

మరోవైపు తాను మేజర్నని, తన స్వచ్ఛంద నిర్ణయంతోనే నేత్రపాల్‌తో సహజీవనం చేస్తున్నానని అనామిక పోలీసులకు స్పష్టం చేసింది. తమకు  ప్రాణహాని ఉందని (Honour Killing) పిటిషనర్లు కోర్టుకు తెలపడంతో, వారి భద్రతకు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ (SP) వ్యక్తిగత బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించడం విశేషం. అలాగే ఈ జంటను నేరుగా గానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా గానీ లేదా మూడవ వ్యక్తి ద్వారా గానీ సంప్రదించ కూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని కోర్టు కఠినంగా కుటుంబ సభ్యులను హెచ్చరించింది.

ఇదీ చదవండి: షాకింగ్‌ వీడియో : బుల్లెట్‌ బండిని ధ్వంసం చేసిన మహిళ

ఏప్రిల్ 8 కి వాయిదా 
2018 నాటి శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులకు సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండి : బాలేన్‌ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement