బీజేపీకి ఝలక్‌.. ఎన్నికల వేళ ట్విస్ట్‌ ఇచ్చిన అన్నామలై! | Annamalai unhappy over Tamil Nadu BJP-AIADMK seat division | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఝలక్‌.. ఎన్నికల వేళ ట్విస్ట్‌ ఇచ్చిన అన్నామలై!

Mar 28 2026 7:34 AM | Updated on Mar 28 2026 12:45 PM

Annamalai unhappy over Tamil Nadu BJP-AIADMK seat division

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి.  

బీఎల్‌ సంతోష్‌కు ఝలక్‌..
ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్‌ సంతోష్‌ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.

ఢిల్లీకి అభ్యర్థుల జాబితా
27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌, మైలాపూర్‌– మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కోయంబత్తూరు నార్త్‌– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌, నాగర్‌కోయిల్‌– మాజీ కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, తళి – అమరప్రసాద్‌ రెడ్డి, తిరుప్పూర్‌ సౌత్‌ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్‌ – విజయధరణి, మదురై సౌత్‌–రామ శ్రీనివాసన్‌, తిరువణ్ణామలై– అశ్వత్థామన్‌, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్‌, పుదుక్కోట్టై– రామచంద్రన్‌..

రామనాథపురం– జి.పి.ఎస్‌. నాగేంద్రన్‌,రాశిపురం– డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌,వాసుదేవనల్లూర్‌ – ఆనందన్‌ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్‌, ఊటి– భోజ రాజన్‌ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్‌, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్‌, రాధాపురం– బాలకృష్ణన్‌, తిరువారూర్‌ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్‌– ఆర్‌.ఎం. రాధాకృష్ణన్‌, పద్మనాభపురం– ఎడ్విన్‌ జోస్‌,కులచల్‌– శివకుమార్‌ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement