సాక్షి, బళ్లారి/బళ్లారి అర్బన్: నగరంలో శుక్రవారం శ్రీరాముడి నామస్మరణ మార్మోగింది. శ్రీరామ నవమి పురస్కరించుని శ్రీరామ ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయాల్లో శ్రీరామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలకు అభిషేకాలు, పూజలు, అర్చనలు చేపట్టారు. నగరంలోని మోతీ సర్కిల్ వద్ద శ్రీరామాలయం, విద్యా నగరలోని అభయాంజనేయ స్వామి, మిల్లార్ పేట ఆంజనేయ స్వామి, అహంబావి ఆంజనేయ స్వామి ఆలయాలు, శ్రీరాంపుర కాలనీ, కాకర్లతోటలోని ఆలయాల్లో సీతారాములకు అర్చకులు కల్యాణం జరిపించారు. ఆలయాల వద్ద భక్తులకు పానకం, మజ్జిగ పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. నగరంలోని అహంబావిలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీ.వీ.శ్రీనివాస రెడ్డి స్వగృహంలో సీతారాములు కల్యాణోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుడి కాంస్య విగ్రహాలకు అభిషేకం చేశారు.
బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లా కంప్లి తాలూకా శ్రీ రామరంగాపురంలో వెలసిన కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. గ్రామంలో హిందువులు, ముస్లింలు కలిసి ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. ప్రత్యేకంగా ఫరుకు శిలాంబి కుటుంబానికి చెందిన సభ్యులు ఏటా సీతారాముల కళ్యాణోత్సవానికి అవసరమైన బాసింగాలను ఇంటి నుంచి దేవస్థానానికి తీసుకు రావడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సాయంత్రం సీతారాములను పల్లకీలో ఊరేగించారు. అంతకుముందు సీతారాములతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయ స్వాములకు పంచామృతాభిషేకం, అలంకరణ, అర్చనలు చేశారు.
కల్యాణం.. కమనీయం..
రాయచూరు రూరల్: జిల్లాలో శుక్రవారం శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాయచూరు గ్రామీణ నియోజక వర్గంలోని పంచముఖి గాణ దాల్ ఆంజనేయ స్వామి ప్రాణదేవర ఆలయంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్ , వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా వచ్చి దైవ దర్శనం పొందారు. మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేశారు. రాయచూరు నగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రామాలయం, కోటలోని బాలాంజనేయ, పాతాళాంజనేయ, బెట్టద్ రామాలయం, మంగళవారపేట మారుతి దేవాలయంలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య గీతా మందిర్‌లో శ్రీరామ నవమి సందడి నెలకొంది. ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి రామాలయంలో పూజలు చేపట్టారు.
రాయచూరు రూరల్: భక్తులచే ఊయల సేవలు
బళ్లారిలో రథాన్ని లాగుతున్న భక్తులు
బళ్లారిలో సీతారాముల కల్యాణం
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి
సీతారాములకు కల్యాణం జరిపిస్తున్న అర్చకులు
బళ్లారిలో భక్తులకు అన్నదానం
రాయచూరు రూరల్: రాముడికి పూజలు
భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి
శ్రీరామ, ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు
సీతారాముల దర్శనానికి పోటెత్తిన భక్తులు
పలుచోట్ల పానకం, మజ్జిగ, చల్లని పానీయాల పంపిణీ


