రాయచూరు రూరల్: ఐదు రోజుల బాలింత ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయచూరు జిల్లా మాన్విలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మాన్విలో వాసవి (25) అనే మహిళ ఇటీవల నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల అనంతరం శిశువుకు కామెర్లు సోకడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కాని.. వాసవి ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కాలు జారి పడిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలియాల్సి ఉంది.
బండరాయితో
బాది వ్యక్తి హత్య
చెళ్లకెరె రూరల్: పాత కక్షలతో ద్వేషం పెంచుకుని వ్యక్తిని బండరాయితో బాది హత్య చేసిన ఘటన చిత్రదుర్గ తాలూకా బీమా సముద్ర గ్రామంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాంతరాజు (35). హత్య చేసిన నరసింహప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. 2020 సంవత్సరంలో కాంతరాజు, నరసింహప్ప మధ్య గలాట జరిగింది. ఆ సమయంలో నరసింహప్పపై కాంతరాజు దాడి చేశాడు. కాంతరాజుపై నరసింహప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజీ చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కాంతరాజుకు రూ.20 వేలు ఇస్తానని నరసింహప్ప చెప్పాడు. అందుకు కాంతరాజు నిరాకరించాడు. రాజీకి ఒప్పుకోకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గలాటలు జరుగుతున్నాయి. శుక్రవారం మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన నరసింహప్ప బండరాయితో కాంతరాజు తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాంతరాజును చికిత్స నిమిత్తం దావణగెరె ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కాంతరాజు మృతి చెందాడు. ఈ ఘటనపై చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
జయంతుల
ఆచరణపై సమీక్ష
కేజీఎఫ్: అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాం జయంతులను అర్థవంతంగా ఆచరించాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ సూచించారు. జయంతుల ఆచరణపై శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతనంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మారక భవనం వద్ద జయంతిని నిర్వహించాలని పలువురు దళిత నాయకులు కోరారు. అయితే స్మారక భవనం నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నందున ఈసారి తహసీల్దార్ కార్యాలయంలోనే నిర్వహించాలని ఎమ్మెల్యే తెలిపారు.
పీడీఓల సంఘం కార్యవర్గం ఎన్నిక
కోలారు: రాష్ట్ర పీడీఓల సంఘానికి శుక్రవారం ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా మహేష్, కోశాధికారిగా సంపరాజ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మోహన్, రాష్ట్ర పరిషత్ సభ్యురాలిగా భవాని, సంఘటనా కార్యదర్శిగా ముళబాగిలు రమేష్, సునీతా, క్రీడా కార్యదర్శిగా నాగరాజ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ పీడీఓల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.


