నేడు గణితంపై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు గణితంపై వర్క్‌షాప్‌

Mar 28 2026 7:27 AM | Updated on Mar 28 2026 7:27 AM

హుబ్లీ: కర్ణాటక విశ్వవిద్యాలయంలోని సెనేట్‌ హాల్‌లో శనివారం నుంచి సోమవారం వరకు గణిత అధ్యాపకుల బోధన వృద్ధి వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు గణిత శాస్త్ర అధ్యాయనం విభాగం ముఖ్యుడు, ప్రొఫెసర్‌ ఎస్సీ సిరాళ హట్టి ఓ ప్రకటనలో తెలిపారు. కర్ణాటక విశ్వవిద్యాలయం, గణిత శాస్త్ర అధ్యయన విభాగం, పావాటే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌, సైన్స్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ వాలికర, ప్రొఫెసర్‌ సాలిమఠ, తదితరుల జ్ఞాపకార్థం గణితంపై వర్క్‌షాప్‌ ఉంటుందన్నారు. గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్‌ ధనుంజయ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రముఖులు ప్రొఫెసర్‌ ఎం.డేవిడ్‌, ఉషా, ప్రొఫెసర్‌ భజంత్రితో పాటు కర్ణాటక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌.శంక్రప్ప తదితరులు పాల్గొంటారన్నారు.

గ్యాస్‌ ఏజెన్సీలపై

చర్యలు తీసుకోవాలి

హుబ్లీ: ఎల్‌పీజీ సిలిండర్లను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ధ్వని సంఘం నేతలు శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కొందరు గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్న ఎక్కువ ధరకు సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అలాంటి ఏజెన్సీలను కనుక్కొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కార్తీక్‌ నాయక, బసవరాజ జాదవ, షణ్ముఖ కట్టి, లోకేష్‌, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

హుబ్లీ: నగర రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారం–1 రైల్వే బ్రిడ్జి కింద అస్వస్థతకు గురైన గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స నిమిత్తం కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యక్తి వయస్సు సుమారు 55 ఏళ్లు ఉండొచ్చు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే సిబ్బంది ఓ ప్రకటనలో కోరారు. మరో ఘటనలో నగరంలోని లక్ష్మీ కాంప్లెక్స్‌ నురాణి మార్కెట్‌ అంగడి మెట్లపై తెలియని వ్యాధితో బాధపడుతూ అనిల్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. చెత్తాచెదారం విక్రయించే జీవనం సాగించే వాడని సమాచారం. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు ఉంటే కమరిపేట పోలీసులను సంప్రదించాలని సంబంధిత అధికారులు కోరారు. ఘటనపై కమరిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గోవుల సంరక్షణకు ముందుకు రండి

రాయచూరు రూరల్‌: నగరంలో గోవుల సంరక్షణకు అదికారులు ముందుకు రావాలని శివసేన నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఆ సంఘం అధ్యక్షుడు మహస్‌ విలేకరులతో మాట్లాడారు. నగరంలోని వీధుల్లో సంచరించే గోవులను రక్షించి వాటిని గోశాలకు తరలించాలని సూచించారు. వేసవి కాలంలో ఎండల తీవ్రతకు గోవులు మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మానవతా దృక్పథంతో గోవులను కాపాడాలని కోరారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు.

క్షయ నియంత్రణకు చర్యలు

రాయచూరు రూరల్‌: జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధిని నియంత్రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాలను నేరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరు క్షయ రోగంతో మరణిస్తున్నారని తెలిపారు. వ్యాధి సోకిన మరుక్షణమే ఆరు నెలల పాటు చికిత్సలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గణేష్‌, శాఖిర్‌, నందిత, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్‌లో అగ్ని ప్రమాదం

ముగ్గురు విద్యార్థులకు గాయాలు

సాక్షి, బళ్లారి: విజయపుర జిల్లా ముద్ధిబిహాల్‌ తాలూకా ఫాళపూజి గ్రామంలోని ఎస్టీ సముదాయ వర్గాలకు చెందిన హాస్టల్‌లో సోమవారం రాత్రి విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేయడంతో రంగంలో దిగిన సదరు అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి ప్రమాదాన్ని నివారించారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement