‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీని తలపించే స్టోరీ..! | Kavitha Vasupalli: Doctor Rafted 1,040 km Risked Her Life to Save Others | Sakshi
Sakshi News home page

Kavitha Vasupalli: ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్‌..

Mar 27 2026 1:16 PM | Updated on Mar 27 2026 1:31 PM

Kavitha Vasupalli: Doctor  Rafted 1,040 km Risked Her Life to Save Others

కళ్లు పొడుచుకున్నా కనిపించనంత చీకటి. దుర్భేద్యమైన కొండలు. దారంతా రాళ్ళూరప్పలు...అవన్నీ దాటాలి. 150 అడుగుల లోపలకు వెళ్లాలి. అక్కడో మనిషి ఉన్నాడు. ఒళ్లంతా దెబ్బలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. అతడిని బయటకు తీయాలి. ఆ ప్రాణం కాపాడాలి. ఇదేమీ సినిమా కథ కాదు. నిజజీవిత విజయ గాథ. పర్యాటకుడి ప్రాణలు కాపాడిన సాహస బృందంలో శ్రీకాకుళం జిల్లాలోని  మెట్టూరు గ్రామానికి చెందిన మేజర్‌ కవిత ఉన్నారు....

భయపడితే భయమే మిగులుతుంది. ఆ భయం మరింత భయపెడుతుంది. ఆ భయాన్ని కాలదన్ని ముందుకు వెళితే సాహసం అవుతుంది. విజయం సొంతం అవుతుంది. ప్రాణరక్షణ చేసే ఆపద్భాందవ శక్తి అవుతుంది.

ఉసిమలై లోయలో...
మలయాళ చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక వ్యక్తి లోయలోకి పడిపోతే ఆపసోపాలు పడి బయటకు తీస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఊసిమలై లోయలో ఉన్న నీడల్‌రాక్‌ వ్యూ పాయింట్‌ దగ్గర జరిగింది. 

ఈ నెల 19న ఈ వ్యూ పాయింట్‌ దగ్గర ఒక  పర్యాటకుడు సెల్ఫీ దిగుతూ 150 అడుగుల లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయం వెల్లింగ్టన్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ సెంటర్‌ (ఎంఆర్‌సీ)కు తెలియజేయడంతో ఇండియన్‌  ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 29 ఏళ్ల సిక్కోలు సివంగి మేజర్‌ డాక్టర్‌ వాసుపల్లి కవిత కీలక పాత్ర పోషించారు. ఆమెది వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు. 

రెస్క్యూ ఆపరేషన్‌
పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అగ్నిమాపక అధికారులు, అటవీ అధికారులు, సహాయక బృందాలు సంయుక్తంగా సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ చీకటి పడడంతో అంతా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్మీ బృందం లెఫ్టినెంట్‌ కల్నల్‌ చందన్‌  మోహతా నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్‌  చేపట్టారు.

రాత్రి 9.15 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో చిమ్మ చీకటి అలుముకుని ఉంది. కఠినమైన భూభాగం, ఎత్తైన ప్రదేశాలు, లోయలను దాటుకుంటూ 150 అడుగుల లోయకు చేరుకున్నారు. టార్చీల వెలుగులో బాధితుడిని గుర్తించారు. అప్పటికే ఛాతీ, చేయి, వీపు, తుంటి ఎముకలు విరిగి కదలలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించారు. 

ప్రాణాలు కాపాడారు...
టార్చ్‌లైట్‌ వెలుగులో క్షతగాత్రునికి మేజర్‌ డాక్టర్‌ కవిత ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అక్కడే స్ట్రెచర్‌ను ఏర్పాటు చేశారు. లోయ పక్కన ఉన్న రెండు పర్వతాల మధ్య 70 మీటర్ల టైరోలియన్‌  ట్రావర్స్‌ లైవ్‌ ఏర్పాటు చేసి  రక్షణ కల్పించారు. గురువారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించిన ఈ ఆపరేషన్‌  వేకువజాము 3.30 గంటల వరకు సాగింది. ఈ ఆపరేషన్‌లో కవిత కీలక పాత్ర పోషించారు. గత సంవత్సరం బ్రహ్మపుత్ర నదిలో 1,040 కిలోమీటర్లు రాఫ్టింగ్‌ యాత్ర పూర్తి చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు.
– కె. చలపతిరావు, వజ్రపు కొత్తూరు, రూరల్‌ సాక్షి, శ్రీకాకుళం 

(చదవండి: పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement