దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఘాటి సుబ్రమణ్య దేవాలయంలో గురువారంనాడు హుండీలను లెక్కించారు. మొత్తం రూ.39.49 లక్షల నగదు, 830 గ్రాముల వెండి కానుకలు, 4 గ్రాముల బంగారం, 10 సింగపూర్ డాలర్లు లభించాయి.
ఆర్టీసీ బస్సు కింద పడ్డ చిన్నారి
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా సవదత్తి బస్టాండులో ఘోరం జరిగింది. బస్సు కదులుతుండగా ఓ మహిళ మూడేళ్ల పాప ఎత్తుకుని పరుగున వచ్చి బస్సు ఎక్కబోయింది. అయితే పాప చేజారి కిందపడడం, బస్సు చక్రాలు పాప మీద నుంచి వెళ్లడంతో చిన్నారి రక్తగాయాల పాలైంది. పాప రెండు కాళ్లు చిదిగిపోయాయి. రక్తమోడుతున్న పాపను స్థానికులు తక్షణం ఎత్తుకుని ఆస్పత్రికి తరలించారు. తల్లి ఆతృత, బస్సుల్లో రద్దీ వల్ల ఈ ఘోరం జరిగిందని అందరూ వాపోయారు. పాప గాయపడిన వీడియోలు వైరల్ అయ్యాయి.
బాలున్ని చిదిమిన లారీ
దొడ్డబళ్లాపురం: లారీ రూపంలో మృత్యువు బాలున్ని బలిగొంది, ఈ విషాదం రామనగర తాలూకా బిడదిలో జరిగింది. విజయ్ (13) అనే బాలుడు గురువారం ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో విజయ్ తీవ్రగాయాలతో అక్కడే మరణించాడు. పాఠశాలకు వెళ్తూ టాటా చెప్పిన చిన్నారి కొంతసేపటికే కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. లారీ డ్రైవర్‌పై బిడది పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు మోసగాళ్లకు కటకటాలు
మైసూరు: కార్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను మైసూరు పోలీసులు పట్టుకున్నారు. మైసూరులోని గౌసియానగర నివాసి, పండ్ల వ్యాపారి రుమాన్ షరీఫ్, రాజీవ్‌నగర నివాసి, కారు డీలర్ ముజాహిద్ పాషా, లష్కర్ మొహల్లా నివాసి, కార్ మెకానిక్ షహబుద్దీన్ నిందితులు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 8 కార్లను స్వాధీనపరచుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ బాలదండి తెలిపారు. వీరు సెకండ్ హ్యాండ్ కార్లను యజమానుల నుంచి కొంటామని చెప్పి మొదట కొంత డబ్బు ఇస్తారు. మిగతా సొమ్మును ఆర్‌సీ బుక్ తీసుకునేటప్పుడు చెల్లిస్తామనేవారు. తరువాత ఆ కార్లను ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి తక్కువ ధరకు మంచి కార్లు లభిస్తున్నాయని చెప్పి అమ్మి సొమ్ము చేసుకునేవారు. అయితే కారు ఆర్‌సీ, ఇన్సూరెన్స్ తదితర దాఖలాలను ఇచ్చేవారు కాదు. వీరి చేతిలో రూ.5.50 లక్షలను కోల్పోయిన అభిషేక్ అనే వ్యక్తి బన్నూరు ఠాణాలో ఫిర్యాదు చేయగా డొంక కదిలింది. నిందితులు బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్లను తెచ్చి మైసూరులో అధిక ధరలకు విక్రయించేవారు. ఈ ముఠా చేతిలో పలువురు మోసపోయారని తెలిపారు.
పెట్రోలు, సిలిండర్ల కోసం టెన్షన్
యశవంతపుర: వారం రోజుల తరువాత పెట్రోల్ దొరకదని ప్రచారం జరగడంతో ద్విచక్ర వాహనదారులు బంకుల వద్ద ఎగబడ్డారు. మామూలుగా రూ.100 పెట్రోల్‌ను నింపుకొనే వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకొంటున్నారు. బెంగళూరులో పెట్రోల్ బంకుల వద్ద జన జాతరగా మారింది. చిక్కబళ్లాపుర, బీదర్, రాయచూరు, బళ్లారి, బెళగావి, దావణగెరెలోనూ కొన్నిరోజులుగా బంకుల్లో రద్దీ ఏర్పడింది. వైరల్ అవుతున్న వీడియోలను చూసి ఇతర వాహనదారులు కూడా బంకులకు పరుగులు పెడుతున్నారు. పెట్రోల్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. కొందరు పెట్రోలు దొరకని సోషల్ మీడియాలో రీల్స్ పెడుతూ టెన్షన్ పుట్టిస్తున్నారు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు మాత్రం నిజంగానే దొరకడం లేదు. బెంగళూరులో ఏజెన్సీల వద్ద పెద్దసంఖ్యలో జనం సిలిండర్ల కోసం వచ్చారు.


