మైనర్ కాదు... కిల్లర్
మృతులు యమున, ఆమె తమ్ముడు సుదీప్ (ఫైల్)
యశవంతపుర: రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో మహిళ, ఆమె సోదరున్ని ఓ మైనర్ బాలుడు నరికి హత్య చేశాడు. సిలికాన్ సిటీలో పెరిగిపోతున్న హత్యా సంస్కృతికి, మైనర్లలో నేర ప్రవృత్తికి ఈ దుర్ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. పీణ్యా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఈ జంట హత్యలు జరిగాయి. బాలుడు (16) దాడిలో యమున (36), ఆమె తమ్ముడు సుదీప్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బ్యాడనహళ్లి పరిధిలో యమున, భర్త మల్లేగౌడ నివసిస్తుండేవారు, వీరికి 18 ఏళ్ల కూతురు, 17 ఏళ్ల కొడుకు ఉన్నారు. అయితే మల్లేగౌడ, పీణ్యాలో ఛాయా అనే మహిళతో ఆక్రమ సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి యమున భర్తతో గొడవ పడుతోంది. గత 3, 4 నెలల నుంచి రెండు కుటుంబాల మధ్య పోట్లాటలు జరిగి పోలీసు స్టేషన్ల వరకూ వెళ్లారు.
ప్రశ్నించడానికి వెళ్లగా..
కానీ చాయా మాయలో పడి భర్త పద్ధతి మార్చుకోలేదనే కోపంతో యమున, తమ్ముడు సుదీప్‌ను తీసుకుని ఛాయా ఇంటికి వెళ్లింది. అక్కడ ఛాయా, యమునల మధ్య వాగ్వాదం మొదలై పెద్ద రగడగా మారింది. ఛాయా కొడుకు ఇంట్లోని మచ్చు కొడవలి తీసుకుని యుమున, సుదీప్‌లను ఇష్టానుసారం నరికివేశాడు. ఇద్దరూ రక్తపు మడుగులో మరణించారు. పీణ్యా పోలీసులు చేరుకుని బాలున్ని, అతని తల్లిని, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మహిళ, ఆమె తమ్ముని నరికివేత
తన తల్లితో గొడవ పడ్డారని కిరాతకం


