గ్యాస్‌ బుకింగ్‌ టైమ్‌లో మార్పు.. కేంద్రం క్లారిటీ | No change in LPG refill timelines stocks adequate says Govt | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ బుకింగ్‌ టైమ్‌లో మార్పు.. కేంద్రం క్లారిటీ

Mar 25 2026 3:31 PM | Updated on Mar 25 2026 3:50 PM

No change in LPG refill timelines stocks adequate says Govt

సోషల్ మీడియాలో ఎల్‌పీజీ (LPG) రీఫిల్ బుకింగ్‌పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.

వైరల్ వార్తల్లో ఏముంది?
గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్‌ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్‌కు అయితే 35 రోజులు గ్యాప్‌ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.

కేంద్రం, ఐవోసీఎల్‌ వివరణ
ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్‌లతో ‍సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement