రాయచూరు రూరల్: అధికారులు ప్రజల సమస్యలపై స్పందించాలని మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు శ్యాం భట్ సూచించారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాలింతల మరణాల నియంత్రణ, స్కానింగ్ కేంద్రాలపై నిఘా, పోక్సో చట్టం, ఇతరత్ర అంశాలపై అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం నగరంలోిని బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు. సరైన సమయంలో బస్‌లను నడపరని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బాలికల హాస్టల్‌లో సరైన భోజనం వడ్డించ కుండా ఉండడం, సరైన మౌలిక సౌకర్యాలు కల్పించక పోవడంపై అధికారులపై చిందులు తొక్కారు. జిల్లా జైలును పరిశీలించి ఖైదీలతో పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి మహిళలపై దౌర్జన్యం కేసులు, వరకట్నం, బాల్య వివాహాలు వంటి కేసుల వివరాలు తెలుసుకున్నారు. రాత్రి ఒపెక్ ఆస్పత్రిలో నేలపై పడుకున్న రోగితో మాట్లాడారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వంటగోడి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర కమిషనర్ జుబిన్ మహాపాత్రో, సంతోష్ రాణి, సురేంద్రబాబు, నందిత, నవీన్ కుమార్‌లున్నారు.


