రాయచూరు రూరల్: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు.. కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్‌కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజన తో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది. సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు.
సీఎం సిద్దు భార్యకు
హైకోర్టు నోటీసులు
శివాజీనగర: మైసూరు అర్బన్ అభివృద్ధి అథారిటీ (ముడా) నుంచి అక్రమంగా ఇళ్ల స్థలాలను తీసుకున్నారనే కేసులో సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతికి హైకోర్టు అత్యవసర నోటీసులు జారీచేసింది. అలాగే లోకాయుక్తకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా నోటీసులు పంపింది. ఇళ్ల స్థలాల కేసులో పార్వతి, సిద్దరామయ్యల దోషం ఏమీ లేదని లోకాయుక్త ఇటీవల నివేదికను కోర్టుకు సమర్పించింది. దీనిని ప్రశ్నస్తూ ఆ కేసులో ఫిర్యాదిదారు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ హైకోర్టుకు పిటిషన్ సమర్పించారు. గురువారం దీనిని విచారించిన న్యాయమూర్తి.. మీ వాదన ఏమిటో తెలియజేయాలని పార్వతితో పాటు ఈడీ, లోకాయుక్తకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు.
తుమకూరులో లంచగొండి అరెస్టు
తుమకూరు: రూ.12 వేల లంచం తీసుకుంటుండగా జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి (డీహెచ్‌ఎఫ్‌ఓ) కార్యాలయంలోని అకౌంట్స్ విభాగం మేనేజర్ ఎం. హెచ్. అరవింద్‌ను లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. తిపటూరుకు చెందిన రాజశేఖర్ ఆరోగ్యశాఖ తరఫున పలు అవగాహన జాగృతి కార్యక్రమాలను నిర్వహించారు, ఇందుకుగాను రూ.1.98 లక్షల బిల్లును రాజశేఖర్‌కు చెల్లించాలి. ఆ బిల్లును మంజూరు చేయడానికి అధికారి అరవింద్ లంచం డిమాండ్ చేశారని బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం, డిహెచ్‌ఓ కార్యాలయ ఆవరణలోనే అరవింద్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లోకాయుక్త ఎస్పీలు ఎ.వి.లక్ష్మీనారాయణ, డీఎస్పీ కె.ఎం.సంతోష్, ఎం. మంజునాథ్, సీఐలు టి. రాజు, బి. మహమ్మద్ సలీం పాల్గొన్నారు.
స్కూటర్‌లోకి దూరిన నాగుపాము
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో వాటర్ బోర్డ్ ఆఫీసు ఆవరణలో నిలిపి ఉన్న స్కూటర్‌లోకి నాగుపాము దూరింది. స్నేక్ కిరణ్ ఆ పామును బయటకు తీశారు. ఆ స్కూటరు ఆఫీసులోని ఓ ఉద్యోగిది. గత కొన్ని రోజులుగా ఒక పాము తిరుగుతున్నట్లు సిబ్బంది చూశారు. మంగళవారం నిలిపి ఉన్న స్కూటీలో పాము వెళ్తుండగా కొందరు చూసి పాముల సంరక్షకుడు కిరణ్‌కు సమాచారమిచ్చారు. కిరణ్ స్కూటర్‌ని గాలించి ఫుట్‌బోర్డ్ కింద దాక్కున్న సుమారు 2 అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకుని దూరంగా వదిలివేశాడు.
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
బనశంకరి: బెళగావి సిటీలోని మార్కెట్ పోలీసులు నకిలీ కరెన్సీ నోట్ల ముఠాని గురువారం అరెస్టు చేశారు. మహమ్మద్ అర్బాజ్, రూపేశ్ వాకోడే, మహమ్మద్ హుసేన్ బక్షి, శ్రవణకుమార్ పట్టుబడ్డారు. వీరి నుంచి కారు , రూ.2 లక్షల 40 వేల వేల నకిలీ కరెన్సీనోట్లు, 4 మొబైల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన ఈ నలుగురు నకిలీ నోట్లను ముద్రించి ఎవరైనా రూ. లక్ష అసలైన నోట్లు ఇస్తే రూ.2 లక్షల నకిలీ నోట్లు అందించేవారు. బెళగావి ఖడేబజార్‌లోని ఓ షాపులో నకిలీ నోట్లు ఇచ్చి వస్తువులు కొనడానికి యత్నించారు. అనుమానంతో దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్కెట్ పోలీసులు దాడిచేసి నలుగురినీ పట్టుకున్నారు. ఈ ముఠాలోని ముఖ్యుడు గోవా జైలులో ఉన్నాడని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బస్సుల్లో దొంగల ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను మాగడి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఉండే హోసూరువాసి మాలా(40), నరసింహ (19), కోలారు జిల్లా మాలూరు తాలూకావాసి అంజలి (28), కుమార్ (36) నిందితులు. ఇటీవల ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు కేఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ నుంచి వీరు 383 గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు గాలించి దొంగల ముఠాను పట్టుకున్నారు. బస్సుల్లో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికుల సొత్తును కాజేవారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారు నగలు రికవరీ చేసుకున్నారు.


