సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప(91) మృతితో ఖాళీ పడిన నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థి సాదిక్ పైల్వాన్ గట్టి సవాల్ విసురుతున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి విదితమే. ఆయన్ను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరిస్తామని సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ ప్రకటించిన నేపథ్యంలో సాదిక్ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తాను లాలిపప్ తినే పిల్లాడిని కానని, ఎవరో ఒప్పిస్తే నామినేషన్ వెనక్కి తీసుకునే వాడిని కాదని, ఎట్టి పరిస్థితుల్లో ఉప పోరు బరిలో ఉండి తన సత్తా చాటతానని హెచ్చరించారు. సీనియర్ నేత శ్యామనూరు మనవడు సమర్థ్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆయన రగిలిపోతున్నారు.
టికెట్ ఆశిస్తే తప్పేంటి?
తాను కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా సేవ చేశానని, ముఖ్యంగా శ్యామనూరు శివశంకరప్పకు ఎన్నో ఏళ్లుగా ఆప్తుడుగా పని చేశానని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తాను టికెట్ ఆశించడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. మైనార్టీలు అధికంగా ఉన్న దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరామని, అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనను పట్టించుకోలేదన్నారు. ముస్లిం సోదరులు, అహింద సమాజ ప్రజలు తనకు వెన్నంటి ఉన్నారని, కచ్చితంగా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు. పోటీ నుంచి తప్పుకునేది లేదని సాదిక్ ప్రకటించిన తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారోనన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు.
పెరుగుతున్న ఉత్కంఠ
మైనార్టీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సాదిక్ పోటీ నుంచి తప్పుకోకపోతే ఆ వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలా ఆకట్టుకుంటారు? లేక సాదిక్ మైనార్టీలను తన వైపునకు తిప్పుకుని కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ కొడతారా అన్న ఉత్కంఠ నెలకొంది. ముస్లింలకు టికెట్ కేటాయించకపోవడంతో ఇప్పటికే పలువురు మైనార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కూడా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్‌కరియప్ప కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలో వచ్చే నెల 9న జరగనున్న దావణగెరె ఉప పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో దావణగెరె, బాగల్‌కోటె రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్న ఉప ఎన్నికల్లో అందరి దృష్టి దావణగెరె నియోజకవర్గంపై పడింది.
నామినేషన్ విరమించుకోనంటున్న
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి
శ్యామనూరు సమర్థ్‌కు టికెట్ ఇవ్వడంపై సాదిక్ పైల్వాన్ ఆగ్రహం
అహింద ఓట్లపై దృష్టి, నన్ను
గెలిపించాలని వీడియో విడుదల
అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌గా మారిన ఈ పరిణామం


