
వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత
హొసపేటె: స్వయం సహాయక బృందాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కసాపుర గ్రామంలో నాబార్డ్, ఎంపీ నిధులతో నిర్మించిన వ్యవసాయ ప్రొసెసింగ్, వేరుశనగ, చింతపండు, ప్రొసెసింగ్ యూనిట్, రైతు శిక్షణ, జనరల్ ఫెసిలిటీ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. వివిధ బ్యాంక్ పథకాల కింద రుణాలు పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీతో రైతులు, మత్య్సకారులు, చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ ద్వారా అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులు సూచించారు. విజయనగర జిల్లాలో 1,80,234 కేసీసీ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేసీసీ కార్డులు అందని లబ్ధిదారులందరూ డిసెంబర్ చివరి నాటికి మిషన్ మోడ్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కార్డులను అందుకోలేని వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తోందన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని 7 జిల్లాల్లో ఎఫ్‌పీఓలు, స్వయం సహాయక బృందాల ద్వారా రైతు ఉత్పత్తుల ఆధారంగా ప్రొసెసింగ్ యూనిట్లను స్థాపించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే, డాక్టర్ శ్రీనివాస్, లతా మలికార్జున, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కమిషనర్ ఉమా మహదేవన్, నాబార్డ్ అధ్యక్షుడు కాగి, జిల్లాధికారి ఎస్ కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్‌జామ్ మహమ్మద్ అలీ అక్రమ్‌షా, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనురుద్దన్ షావాన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్