
బెదిరింపు ఫోన్ కాల్ చేశారు
దొడ్డబళ్లాపురం: మంత్రి ప్రియాంక్ ఖర్గే అనుచరుడు తనకు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని బీజేపీ నేత, మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. బెళగావి నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి ప్రియాంక్ ఖర్గే గురించి మాట్లాడితే హుషార్..అంటూ బెదిరించాడన్నారు. ఆ మొబైల్ నంబర్ తనవద్ద ఉందని, అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేయనన్నారు.
తేనెటీగల దాడిలో
విద్యార్థులకు అస్వస్థత
శివమొగ్గ : తేనెటీగల దాడి చేయడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈఘటన శివమొగ్గ జిళ్లాలోని శికారిపుర తాలూకాలోని బగనకట్టె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టుపై నుంచి తేనెటీగలు దాడి చేశాయి. విద్యార్థులు వాటిబారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటాడి కుట్టాయి. ఘటనలో 13 మంది విద్యార్థులు, ఒక మహిళ అస్వస్థతకు గురవ్వగా ఆస్పత్రికి శికారిపురలోని తరలించారు.
జీతం అందక వాటర్‌మెన్ ఆత్మహత్య
మైసూరు : సంవత్సరాల తరబడి జీతం అందక ఆర్థిక ఇబ్బందులతో వాటర్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన చామరాజ నగర తాలూకా హోంగనూరు గ్రామంలో జరిగింది. చిక్క సునాయక(65) అనే వ్యక్తి అరకొర జీతంతో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు సంతానం ఉన్నారు. 27 నెలలుగా వేతనం అందక కుటుంబ పోషణ కష్టమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వేతనం మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలలు రూపా, పీడీఓ రామేగౌడను కోరగా తిట్టి పంపించారు. దీంతో మనో వేదనకు గురై శుక్రవారం సూసైడ్ నోట్ రాసి పంచాయతీ కార్యాలయం తలుపు వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
నటి సంగీతభట్‌కు అస్వస్థత
● చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిక
యశవంతపుర: శాండిల్‌వుడ్ నటి సంగీతభట్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. హైస్టరోస్కోపిక్ పోలిఫెక్టమికి వైద్యులు శస్త్రచికిత్సలు చేశారు. గర్భాశయంలో 1.75 సెంటిమీటర్ల మేర పెరిగిన పాలిప్(గడ్డ)ను గుర్తించిన్నట్లు సంగీతభట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వ్యాధితో రక్తస్రావంతో పాటు ప్రమాదకరమైన నొప్పులు రావటంతో తూకం తగ్గుతుంది. గడ్డ ఉన్న విషయాన్ని గుర్తించిన తరువాత నెల రోజుల తరువాత ఆమెకు అపరేషన్ చేశారు. అనియమిత రక్తస్రావంతో బహిష్టు సమయంలో హార్మోన్లలో వ్యత్యాసం అవుతుంది. మహిళలు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సంగీతభట్ వివరించారు.