
తుంగభద్రలో పూడికతీత పనులు చేపట్టాలి
సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమ్ గౌడ కోరారు. పలువురు రైతు సంఘం నాయకులతో కలసి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగర మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డితో కలిసి తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతుల సమస్యలను వివరించారు. 1953లో తుంగభద్ర డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తెలంగాణ పరిధిలోని గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగు నీటిని అందిస్తున్నారన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేలాది మంది రైతులకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతోందని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌లో ప్రారంభంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని.. ప్రస్తుతం పూడిక చేరడంతో 33 టీఎంసీలు నీరు తగ్గిపోయి 100 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఆయకట్టు పరిధిలోని రైతులకు దామాషా ప్రకారం నీటిని తగ్గించారని తెలిపారు. తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలమండలి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుంగభద్ర డ్యామ్‌లో పూడిక చేపట్టాలని కోరారు. అలాగే బళ్లారి నగరంలో చిరు వ్యాపారులకు సోలార్ వాహనాలు అందజేయాలని సూచించారు. అంజూర, దానిమ్మ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాధ్యసాధ్యాలను పరిశీలించి తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ జి.వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్.దివాకర్ తదితరులు ప్రాంత సమస్యలను వివరించారు. జాతీయ బ్యాంకుల్లో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న నేపథ్యంలో కర్నాటక గ్రామీణ బ్యాంక్‌లో కూడా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు ఐనాథ్ రెడ్డి విన్నవించారు.
డిమాండ్ల జాబితా సమర్పణ
భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం (కేఏజీబీఓఓ), కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (కేఏజీబీడబ్ల్యూఓ) తరఫున కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అఽధికారులు, ఉద్యోగుల డిమాండ్ల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్ కుమార్ పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
నిర్మలా సీతారామన్‌కు
విన్నవించిన రైతు సంఘం నేతలు
వివిధ సమస్యలపై చర్చించిన
కాంగ్రెస్, బీజేపీ నేతలు

తుంగభద్రలో పూడికతీత పనులు చేపట్టాలి