
బొలెరోను ఢీకొన్న కారు
● ముగ్గురు మృతి
సాక్షి బళ్లారి: హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా కాకోలా సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరోను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దావణగెరె జిల్లా మలెరాణి బెన్నూరు గ్రామానికి చెందిన చమన్ సాబ్, మహబూబ్ సాబ్, లింగమ్మ కారులో వివాహానికి వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలో బొలెరో వాహనాన్ని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రాణిబెన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.39 లక్షలతో
పైప్‌లైన్ పనులు
రాయచూరు రూరల్: నగరంలో రూ.39 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ వెల్లడించారు. శుక్రవారం గంగా నివాస్ వద్ద పైప్‌లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాకర్లు, శాఖ అధికారులను ఆదేశించారు. పాత కాలం నాటి పైపులు కావడంతో తరచుగా పగిలిపోతున్నాయన్నారు. ప్రజలకు నీటి సరఫరా చేయడం కష్ట సాధ్యం కావడంతో నూతన పైప్‌లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సభ్యులు జయన్న, అబ్దుల్ వాహిద్, అల్లా ఉద్దీన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్య
కార్యాలయం ప్రారంభం
హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా మానసిక ఆరోగ్య పరిశీలన మండలి కార్యాలయాన్ని క్రిమ్స్ బోధన ఆస్పత్రి మనోవైద్య విభాగం గది సంఖ్య 111లో అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా సెక్షన్ న్యాయమూర్తి కిరణ్ కిన్ని, దివ్య శ్రీ, సీఎం జిల్లా న్యాయసేవ ప్రాధికార డాక్టర్లు విజయరాజ మనోవైద్య విభాగం డాక్టర్ అక్షయ పాఠక అసోసియేషన్ ప్రొఫెసర్ బసవరాజ్, మనోసామాజిక నిపుణులు మనోవైద్య విభాగం కార్వార క్రిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు
రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి 300వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా త్రిష్ట మనోత్సవాలు, రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల సేవలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. మహ పంచామృతాభిషేకం, గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు జరిపారు.

బొలెరోను ఢీకొన్న కారు

బొలెరోను ఢీకొన్న కారు