
తాగుబోతుల అడ్డాగా పాఠశాల ఆవరణ
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ నడిబొడ్డున ఉన్న పాఠశాల మైదానం తాగుబోతులకు అడ్డాగా మారింది. సాయంత్రం కావడంతో మందుబాబులు పాఠశాల ఆవరణలోకి వచ్చేస్తున్నారు. మద్యం తాగి, సీసాలు, ప్లాస్టిక్ చెత్తను అక్కడే పారేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో కొంత మంది దుర్మార్గులు రోజూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని వలన ఉదయం వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతోంది.
రాత్రి కాగానే గుంపులుగా..
పాఠశాల, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా మద్యం తాగి, ఖాళీ సీసాలు, మద్యం సీసాలు, గుట్కా స్లిప్‌లను విసిరేస్తున్నారు. మరి కొందరు సీసాలు పగలగొడుతున్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, పాఠశాలకు వచ్చే పిల్లలు నిరంతరం ఖాళీ సీసా పెంకులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు పగలిన గాజు ముక్కలు పిల్లల పాదాలకు గుచ్చుకున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి పూట పాఠశాలలో గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు.
లైటింగ్ వ్యవస్థ కరువు
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో లైటింగ్ వ్యవస్థ లేదు. దీనిని దుండగులు దుర్వినియోగం చేస్తున్నారు. పాఠశాల ఆవరణ దేవాలయంతో సమానం అనే సాధారణ జ్ఞానం లేకుండా దుర్మార్గులు పాఠశాల ఆవరణలో ఎటువంటి నిర్వహణ లేకుండా మద్యం సేవిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మరమ్మతులు చేయని వీధి దీపాలను (హైమాస్) మరమ్మతు చేయడానికి పట్టణ పంచాయతీ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి విద్యార్థులకు గుట్కా లాంటి వస్తువులు పుష్కలంగా విక్రయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
తాగిన మందు సీసాలను
అక్కడే పారేస్తున్న వైనం
ఇబ్బందులు పడుతున్న
విద్యార్థులు, ఉపాధ్యాయులు