
ఉద్యోగాల పేరుతో రూ.కోటి వసూలు
● కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలి అరెస్ట్
రాయచూరు రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగాలిపిస్తామని చెప్పి రూ.కోటి వసూలు చేసినట్లు ఆరోపణలపై కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలు విజయ హిరేమఠ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి12 మందితో రూ.కోటి వసూలు చేసింది. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని బాధితులు కోరారు. దీంతో ఆమె బెదిరింపులకు పాల్పడింది. గత్యంతరం లేక బాధితులు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామదుర్గ పోలీసులు విచారణ చేపట్టి విజయ హిరేమఠ్‌ను అరెస్ట్ చేశారు.
బహిరంగ స్థలాల్లో
నమాజును నిషేధించాలి
● సీఎంకు ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ లేఖ
శివాజీనగర: బహిరంగ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో నమాజు చేసేందుకు అవకాశం కల్పించరాదని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆంగ్లంలో రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ‘సర్వజన శాంతి తోట’ అనే ప్రభుత్వ ఆశయం అందరికీ అన్వయించాలి. బహిరంగ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో నమోజు చేసేందుకు అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ సంఘ సంస్థల కార్యకలాపాలను నిషేధించినట్లుగానే నమాజు చేయటాన్ని కూడా నిషేధించాలి. అప్పుడే మీరు నిజమైన లౌకికవాది అనిపించుకుంటారు’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై మళ్లీ
కాంట్రాక్టర్ల వార్
● నెలలోగా బకాయిలు విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం
శివాజీనగర: కాంట్రాక్టర్ల సంఘం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాంట్రాక్టర్ల పెండింగ్ సొమ్ము చెల్లించాలని, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి చేస్తూ పోరాటం చేపడతామని హెచ్చరించింది. శుక్రవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఆర్.మంజునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ వసూలు అధికమైందన్నారు. 60 నుంచి 80 శాతం పర్సెంటేజీ కమీషన్ అని తాము చెప్పలేదు. అయితే కాంట్రాక్టర్లకు పెండింగ్ సొమ్ము చెల్లించకుండానే కమీషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. రూ.52 వేల కోట్ల పెండింగ్ సొమ్ము విడుదల చేయాల్సి ఉంది. కొన్ని శాఖలు సొమ్ము విడుదల చేశాయి. రూ.33 వేల కోట్లు పెండింగ్‌లో ఉంది. మరో నెల రోజుల పాటు వేచి చూస్తాం. అంతలోగా సొమ్ము విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సిట్ తనిఖీలు
దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా ఆళంద నియోజకవర్గంలో ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి సీఐడీ, సిట్ అధికారులు శుక్రవారం రెండుచోట్ల దాడులు చేశారు. గుబ్బి కాలనీలో ఉన్న ఆళంద నియోజకవర్గం బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఇల్లు, వివేకానంద నగర్‌లో ఉన్న సీఏ మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దాడులు జరిగాయి. 50 మంది పోలీసులు 80 మందికి పైగా అధికారులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా పట్టణంలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆళంద నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేలకుపైగా ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నించినట్టు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటీల్ ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.