
డ్రగ్స్ దందా ఎలా జరుగుతుందంటే...
బనశంకరి: ఐటీ బీటీ సిలికాన్‌సిటీగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుంది. పలు అక్రమ మార్గాల్లో డ్రగ్స్‌పెడ్లర్లు పోలీసుల కళ్లుగప్పి విదేశీ తపాలా, కొరియర్ ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకుని డ్రగ్స్ దందాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడటంతో బెంగళూరు నగరంలో డ్రగ్స్‌మాఫియా ఎంతమేర విస్తరించింది అనేందుకు నిదర్శనం. ఉడ్తా పంజాబ్ తరహాలో కర్ణాటకలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనింది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రస్తుతం శునకాలు, పిల్లులు, చేపలతో పాటు ఇతర పెంపుడు జంతువుల ఆహారం ముసుగులో విదేశాల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్స్‌ను బెంగళూరుకు దిగుమతి చేసుకుంటుండడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియాతో పాటు వివిధ దేశాల ద్వారా బెంగళూరు నగరానికి డ్రగ్స్ దిగుమతి అవుతుంది.
నలుగురు ఉద్యోగుల అరెస్టు
2019లో డ్రగ్స్ పెడ్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలతో తపాలా శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు విదేశాల నుంచి తపాలా ద్వారా వచ్చే డ్రగ్స్‌ను పెడ్లర్లకు అందించేవారు. విదేశాల నుంచి బెంగళూరుకు పార్శిల్ ద్వారా గత కొన్నేళ్లుగా సరఫరా కొనసాగుతోంది. నెదర్లాండ్స్ నుంచి 2020లో బెంగళూరు చామరాజపేటెకు పార్శిల్ ద్వారా వచ్చిన ఎంఎండీఏ, బ్రౌన్‌షుగర్ లాంటి సైకోట్రోఫిక్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన బెంగళూరు యువకులను అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ విదేశీ తపాలా ద్వారా బెంగళూరుకు సరఫరా చేసుకుంటున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. చామరాజపేటె పార్శిల్స్‌లో 200 డ్రగ్స్ మాత్రలు, ఎండీఎంఏ, బ్రౌన్‌షుగర్ స్వాధీనం చేసుకున్నారు. 2024 అక్టోబరులో విదేశీ తపాలా కార్యాలయానికి రూ.21 కోట్ల విలువ చేసే 600కు పైగా డ్రగ్స్ పార్శిల్స్ సరఫరా కావడంతో సీసీబీ పోలీసులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ అడ్రసులతో పార్శిల్స్
విదేశాల నుంచి పంపిన పార్శిల్స్‌కు నకిలీ అడ్రస్‌లు ఇచ్చారు. కొరియర్, తపాలా కార్యాలయాల్లో డ్రగ్స్ సరఫరా నియంత్రణకు నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించి కొరియర్, తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 2024 డిసెంబరులో న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు కొరియర్ ఏజెన్సీ, తపాలా కార్యాలయాలపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. సంపంగి రామనగర కొరియర్ ఏజెన్సీలో సీసీబీ, డాగ్‌స్క్వాడ్ పార్శిల్స్ పరిశీలించి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 2025 జూలై నెలలో సీసీబీ పోలీసులు చామరాజపేటెలోని విదేశీ తపాలా కార్యాలయంపై దాడి చేసి కొకై న్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, గంజాయితో పాటు సుమారు రూ.6 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని కొందరు విదేశీయులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ దందాలో విదేశీయులు అధికంగా ఉండటం విశేషం. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 35 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 1,013 మంది డ్రగ్స్‌పెడ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత మూడు నెలల్లో బెంగళూరు నగరంలో డ్రగ్స్ దందాకు అధిక కేసులు నమోదయ్యాయి. జూలైలో 158 కేసులు నమోదు కాగా 196 మంది భారతీయులతో కలిపి 5 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఆగస్టులో 132 కేసులు నమోదు కాగా వీరిలో 2024 మంది భారతీయులు, 5 మంది విదేశీయులు, సెప్టెంబరు నెలలో 160 కేసులు నమోదు చేసిన పోలీసులు 237 మంది భారతీయులు, 6 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు.
తపాలా, కొరియర్ ద్వారా విదేశాల నుంచి దిగుమతి
డగ్స్ దందాలో విదేశీయుల భాగస్వామ్యం అధికం
బిజినెస్, మెడికల్ వీసాతో బెంగళూరు నగరానికి వచ్చే విదేశీయులు
అంతర్జాతీయ తపాలా కార్యాలయాల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని విక్రయాలు
డార్క్‌నెట్, డార్క్‌వెబ్ ద్వారా కొరియర్, ఆన్‌లైన్ సేల్
అద్దె ఇళ్ల యజమాని అడ్రస్ అందించి పోస్ట్ ద్వారా డ్రగ్స్ వస్తువుల రవాణా
కొందరు స్థానిక డ్రగ్స్ పెడ్లర్లకు ఆధార్ అడ్రస్ అందించి వారి పేరుతో పార్శిల్స్
పెంపుడు జంతువులు ఆహారం బాక్సుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా
హైడ్రోగంజాయి, అపీము, కొకై న్ అధికంగా విక్రయాలు
ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డ్రగ్స్‌పెడ్లర్లపై పోలీసుల నిఘా
సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌పెడ్లర్లపై ప్రత్యేక నిఘా
సర్పేల్‌వెబ్, డార్క్‌నెట్, డార్క్‌వెబ్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ
ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ సంస్థలతో కలిసి సమాచారం వినిమయం
విదేశీ పౌరులు నివసించే అడ్రస్‌లు, ఉద్యోగ సమాచారం సేకరణ

డ్రగ్స్ దందా ఎలా జరుగుతుందంటే...

డ్రగ్స్ దందా ఎలా జరుగుతుందంటే...