
విషాదంలోనూ దాతృత్వం
బనశంకరి: బెంగళూరు మారతహళ్లిలో వైద్యురాలైన భార్యకు అధికంగా మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త, జనరల్ సర్జన్ మహేంద్రరెడ్డి ఉదంతం నగరవాసులను కలవరపరుస్తోంది. అంత బాధలోనూ కూతురి సంస్మరణార్థం రూ.4 కోట్లకు పైగా విలువచేసే భవంతిని ఆమె తండ్రి మునిరెడ్డి ఇస్కాన్ కు దానం చేశారు. సంపన్నుడైన మునిరెడ్డి కూతురి కోసం మున్నకోళలు లో రూ.4 కోట్లతో భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. కుమార్తె లేనప్పుడు ఆ ఇల్లు ఎందుకని సేవా కార్యక్రమాల కోసం ఇస్కాన్‌కు రాసిచ్చామని కృతిక సహోదరి డాక్టర్ నిఖితా తెలిపారు.
బంధువుల ఆరోపణ
మహేంద్రరెడ్డికి వేరే యువతితో అక్రమ సంబంధం ఉందని, ఆమె కోసం భార్యను హత్య చేసినట్లు కృతికారెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు. అల్లుడు మహేంద్రరెడ్డి ఆస్పత్రి నిర్మిస్తామంటే మునిరెడ్డి సాయం చేశారు. కానీ పెళ్లయిన ఏడాదిన్నరలోపే ఘోరం జరిగిందని మీడియా ముందు ఏకధాటిగా విలపించారు.
వైద్యురాలు కృతికారెడ్డి నివాస భవనం ఇస్కాన్‌కు వితరణ
విలువ రూ. 4 కోట్ల పైనే
ఆమె తండ్రి మునిరెడ్డి వెల్లడి
భర్తకు 9 రోజుల కస్టడీ
రెండురోజుల పాటు మత్తుమందును ఇచ్చి భార్యను హత్య చేసిన కేసులో మహేంద్రరెడ్డి ఉడుపిలో తలదాచుకొని ఉండగా మారతహళ్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి నగరానికి తీసుకువచ్చారు. కోర్టులో హజరుపరిచి కస్టడీని కోరగా, 9 రోజుల పాటు విచారణకు జడ్జి అనుమతించినట్లు వైట్‌ఫీల్డ్ డీసీపీ పరశురామ్ తెలిపారు. విచారణలో పూర్తి నిజాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నారు.

విషాదంలోనూ దాతృత్వం