
నగరాభివృద్ధికి ఐక్యంగా శ్రమిద్దాం
బళ్లారిటౌన్: నగర సర్వతోముఖ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని ఎంపీ తుకారాం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పంచాయతీ సభాంగణంలో ఏర్పాటు చేసిన దిశ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అందుబాటులో ఉన్నందున అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అధికారులు రాజ్యాంగ ఆశయాలతో పాటు మానవతా దృష్టితో పని చేయాలన్నారు.
దొంగ ఏజెన్సీలకు త్వరలో బ్రేక్
వరి పంటను అనధికారికంగా ఖరీదు చేసి మోసాలు చేస్తున్న దొంగ ఏజెన్సీలకు త్వరలో చెక్ పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులను నమ్మించి మొబైల్ యాప్ ద్వారా వరిని ఖరీదు చేస్తున్నట్లు నటించి మోసాలు చేస్తున్నట్లు వెలుగు చూస్తున్నందున అధికారులు కూడా అప్రమత్తం కావాలన్నారు. సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ మాట్లాడుతూ సండూరు భాగంలో ఓ రైతు ఏ పంట వేశారంటే అందరూ కూడా అదే పంటను వేస్తున్నారన్నారు. దీని వల్ల అసమతుల్యత చెంది పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా యూరియా ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. సేంద్రీయ ఎరువులు, మందులు వాడేలా సూచించాలన్నారు.
అఖండ జిల్లాకు 24 పోస్టల్ కార్యాలయాలు
అఖండ జిల్లాలో తన అవధిలో బళ్లారి, విజయనగర జిల్లాల్లో 24 నూతన తపాల కార్యాలయాలు మంజూరు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. దీని వల్ల పోస్టల్ సదుపాయాలు మరింత వేగవంతం అవుతాయన్నారు. అదే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మరింత చురుగ్గా చేపట్టేలా నూతన కేబుల్ లైన్ల పనులు చేపడుతున్నట్లు వివరించారు. అంతకు ముందు నగరంలోని రైల్వే స్టేషన్‌లో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం సంజీవిని స్వసహాయ సంఘాల ఉత్పత్తి మార్కెట్‌ను ప్రారంభించారు. అనంతరం జిల్లా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజల నుంచి విన్నపాలను స్వీకరించారు. ఎమ్మెల్సీ వైఎం సతీష్, పాలికె మేయర్ ముల్లంగి నందీష్, జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ హ్యారీష్ సుమేర, ఎస్పీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి లోక్‌సభ సభ్యుడు తుకారాం
అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపు