
ఎయిర్‌పోర్టులో మత్తు గుట్టలు
బనశంకరి: శ్రీలంకలోని కొలంబో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చిన రూ.50 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. వివరాలు.. ఈ నెల 9వ తేదీన కొలంబో నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 31 కేజీల హైడ్రో గంజా, 4 కేజీల అరుదైన సిలోసిబిన్ పుట్టగొడుగులను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో శ్రీలంక పౌరున్ని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 14 కిలోలు హైడ్రో గంజాయి, 2 కేజీల సిలోసిబిన్ పుట్టగొడుగులను పట్టుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ను, ఇతర నిషేధిత వస్తువులను ఆహార పదార్థాల టిన్నుల్లో నింపి తనిఖీల నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. వీటన్నింటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని తెలిపారు.
రూ. 100 కోట్ల హైడ్రో గంజాయి..
నగరానికి హైడ్రో గంజాయి రవాణా అధికమైందని బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. 2025లో ఇలాంటి 18 కేసుల్లో రూ.100 కోట్ల కు పైగా విలువచేసే 220 కిలోల హైడ్రో గంజాయి పట్టుబడిందని, కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర కు చెందిన 45 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ దీని వెనుక ఉన్నట్లు తెలిపారు.
మార్కెట్‌లో కేజీ రూ.80 లక్షలు
మామూలు గంజాయి కంటే హైడ్రో గంజాయి ఎక్కువ ప్రభావవంతమైనదని పెడ్లర్లు ప్రచారం చేస్తుంటారు. చిల్లర మార్కెట్‌లో ఒక కేజీ సుమారు రూ.80 లక్షల ధర పలుకుతోందని,
ఐటీ బీటీ ఉద్యోగులు, బడా బాబులు పార్టీల్లో మత్తుకోసం అధికంగా వినియోగిస్తారని సమాచారం. అనేకమంది యువకులు థాయ్‌లాండ్ నుంచి హైడ్రోఫోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. టెట్రాప్యాక్‌లు, చాక్లెట్లు, ఆహార పొట్లాలు, దుస్తులు మొదలైన వస్తువుల్లో దాచిపెట్టి స్మగుల్ చేస్తుంటారు. దుబాయ్, కొలంబో, నేపాల్‌ల మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.
రూ.50 కోట్ల హైడ్రో గంజాయి, పుట్టగొడుగుల సీజ్
శ్రీలంకవాసితో పాటు ముగ్గురు అరెస్ట్

ఎయిర్‌పోర్టులో మత్తు గుట్టలు

ఎయిర్‌పోర్టులో మత్తు గుట్టలు