
సోషల్ మీడియాలో కంపు
బనశంకరి: సోషల్ మీడియాలో మహిళలను దూషించడం, అశ్లీల చిత్రాలు, ద్వేషపూరిత మెసేజ్‌లు, బెదిరింపు ఘటనలు హెచ్చుమీరాయి. ఈ ఏడాది గత 9 నెలల్లో 953 కేసులు నమోదు కావడం చూస్తే సోషల్ మీడియా క్రైమ్ ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇటీవల అసభ్య పదజాలంతో మహిళలను దూషించడం, ద్వేషంతో కూడిన మెసేజ్ పంపడం, బెదిరింపులకు పాల్పడటం, మత సామరస్యానికి భంగం కలిగించే కేసులు అధికమయ్యాయి.
51 శాతం పెరుగుదల
గత కొద్దిసంవత్సరాలతో పోలిస్తే ఇటువంటి నేరాల రేటు 51 శాతం పెరగడం గమనార్హం. బెంగళూరు నగర పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యంగా ఉన్న 300 కి పైగా పోస్టులను తొలగించి 50 కి పైగా పోకిరీల అకౌంట్‌లను బ్లాక్ చేశారు. మహిళలు, యువతులు ఫోటోల పోస్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆకతాయిలు, సైబర్ నేరగాళ్లు వారి ఫోటోలను సేకరించి దుర్వినియోగం చేసే ప్రమాదముందని హెచ్చరించారు.
యువకుల పెడపోకడ
సోషల్ మీడియాలో బెదిరింపులు, ప్రాణహానిని తలపెట్టే మెసేజ్‌లు. అసభ్య పదజాలంతో దూషించిన ఉదంతాల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువ లైక్‌లు, అధిక ఫాలోయర్స్‌ను పొందడానికి తప్పుడు మార్గాల్లో ప్రయత్నిస్తారు. యువత్ సోషిల్ మీడియాలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అనేకమంది యువతులు, మహిళలు తమ ఫోటోలను ఎడాపెడా పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుండగులు డబ్బు కోసం మహిళలను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు తెలిపారు.
మహిళల పట్ల కించపరిచే పోస్టులు
బెంగళూరులో ఏటేటా నేరాల వృద్ధి
సోషల్ మీడియా అనేది నేరస్తుల చేతిలో ఆయుధమైంది. యువతులు, మహిళల పట్ల సులభంగా నేరాలకు పాల్పడుతున్నారు. మహిళల ఫోటోలను సేకరించి మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, ఇతరత్రా అవాంఛనీయాలకు ఒడిగట్టడం సిలికాన్‌సిటీలో అధికమైంది. పోలీసులు నిఘా పెట్టినప్పటికీ నేరాలకు బ్రేకులు పడడం లేదు, సరికదా పెరుగుతున్నాయి.
మార్ఫింగ్ బెడద
వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి ఆన్‌లైన్ మీడియాను యువత, జనం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఉపయోగిస్తుంటారు. చెడును ప్రేరేపించేలా పోస్టులు పెట్టడం, కించపరిచేలా కామెంట్లు, ఫార్వర్డ్– షేరింగ్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వ్యాప్తి చేయడం ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల సమాజంలో వారి పరువు పోవడంతో పాటు కుటుంబాల్లో చిచ్చు రేగి నేరాలూ సంభవిస్తుంటాయి.

సోషల్ మీడియాలో కంపు

సోషల్ మీడియాలో కంపు