
సంఘ్ మీద సర్కారు కయ్యం
సాక్షి, బెంగళూరు/ శివాజీనగర: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో స్వయంసేవక్ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ మీద బీజేపీ భగ్గుమంటోంది. ఈ లేఖను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సిద్ధరామయ్య ఆదేశించడంతో వివాదం మరింత రాజుకుంది.
నిషేధానికి అవకాశం ఉందా
దేశ వ్యతిరేక, ఇతర ప్రమాదకర కార్యకలాపాలకు ఏ సంఘం అయినా పాల్పడితే దానిని నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం కోసం ఆధారాలతో కేంద్రానికి సిఫార్సు చేయవచ్చు.
బీజేపీ కోర్ కమిటీ భేటీ
మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ, పరిణామాల గురించి బీజేపీ కోర్ కమిటీ నాయకులు భేటీ అయ్యారు. ముగ్గురు సభ్యులతో ఓ పరిశీలన కమిటీని నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ కమిటీ గమనిస్తూ ఉంటుందని నేతలు తెలిపారు.
బ్యాన్ చేయాలనలేదు: ఖర్గే
ఆర్‌ఎస్‌ఎస్‌ని బ్యాన్ చేయాలని నేను చెప్పలేదు. బహిరంగ స్థలాల్లో ఆయుధాలు పట్టుకుని కార్యకలాపాలు చేయరాదని మాత్రమే సూచించానని మంత్రి ప్రియాంక ఖర్గే సోమవారం బెంగళూరులో చెప్పారు. తన లేఖ మీద వివాదం రేగడంపై స్పందించారు. బీజేపీ నాయకులు ఎందుకు వారి పిల్లలు, మనవళ్లకు గణేశ వేషం వేయించి చేతిలో కట్టె పట్టించడం లేదు? పేదల పిల్లలనే ఆర్‌ఎస్‌ఎస్ ప్రదర్శనల్లో వేషాలు వేయిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే పాఠశాలలో కవాతు
కలబుర్గి జిల్లాలో అఫజలపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.వై.పాటిల్‌కు చెందిన ఎయిడెడ్ పాఠశాలలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలనం జరిగింది. వందలాదిమంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లాలో ఇలా జరగడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
మంత్రి ఖర్గే లేఖపై సీఎం పరిశీలన!