
పెళ్లయి 5 నెలలు.. భర్త చేతిలో హత్య
యశవంతపుర: కత్తితో పొడిచి నవ వివాహితను భర్త హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఆల్దూరు సమీపంలోని హొసహళ్లి గ్రామంలో జరిగింది. ఆమె పుట్టింటిలోనే ఈ ఘోరం జరిగింది. వివరాలు.. ఐదు నెలల క్రితం నేత్ర (32) అనే మహిళతో నవీన్ వివాహం చేశారు. కొన్నిరోజుల నుంచే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మూడు నెలల కిందట ఆమె హొసహళ్లిలోని పుట్టింటికి చేరుకుంది. ఆదివారం వచ్చిన భర్త.. తనతో వచ్చేయాలని కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో పోట్లాటకు దిగాడు. కోపంలో నవీన్ భార్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన నేత్రాను కుటుంబీకులు చిక్కమగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలను తాళలేక నేత్ర సోమవారం మరణించింది. నేత్ర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్టు చేశారు.
ఈవీ స్కూటర్ విస్ఫోటం
యశవంతపుర: చార్జింగ్ చేస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ బ్యాటరీ పేలి కాలిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. బసవేశ్వరనగర శివనహళ్లి ఫస్ట్ క్రాస్ వద్ద భవనం బేస్‌మెంట్‌లో ముకేష్ అనే వ్యక్తి ఈవీ స్కూటర్‌కు చార్జింగ్ పెట్టాడు. ఈ సమయంలో బ్యాటరీ పేలిపోయి వాహనం మండిపోయింది. దట్టమైన పొగ కమ్ముకుపోయింది. స్థానికులు అందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎక్కువ సేపు చార్జింగ్, అధిక వేడి వల్ల ఇలా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
క్వారీలో అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లిన యువకుడు నీట మునిగి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. బెంగళూరు మాదనాయకనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. కామాక్షిపాళ్యం నివాసి పృథ్విక్ (17), రాజాజీనగరలోని ప్రైవేటు కాలేజీలో ఫస్ట్ పీయూసీ చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మాదనాయకనహళ్లి పరిధిలోని బోళారె క్వారీకి వెళ్లాడు, అక్కడ క్వారీ నీటిగుంతలో ఈత కొట్టాలని దిగాడు. కానీ ఆ నీటికుంటలో శవమై తేలాడు. స్నేహితులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే స్నేహితులే అతడ్ని హత్య చేశారని బాలుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బీఎంటీసీలో ఖాకీలకు ఉచితం
బనశంకరి: బెంగళూరు సిటీ పోలీసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యూనిఫాంలో ఉన్నా, లేకున్నా.. ఐడీ కార్డును చూపించి బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం పోలీసుశాఖ, బీఎంటీసీ ఎండీకి లేఖ రాసింది. దీంతో బీఎంటీసీ అధికారులు కండక్టర్లు, డ్రైవర్లను ఈ మేరకు సమాచారం తెలిపారు. ఇప్పటివరకు యూనిఫాంలో లేని పోలీసులకు ఉచిత ప్రయాణం ఉండేది కాదు.
లంచగొండి పీడీఓ
మండ్య: ఫౌతి ఖాతాను చేయడానికి లంచం డిమాండు చేసి తీసుకుంటున్న పీడీఓ లోకాయుక్త అధికారులకు పట్టుబట్టాడు. జిల్లాలోని మద్దూరు తాలూకాలోని తగ్గహళ్లి గ్రామపంచాయతీలో పీడీఓ సచిన్, బాధితుడు శివలింగయ్యకు ఖాతా చేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. సోమవారం ఆఫీసులో అతని నుంచి రూ. 5 వేలు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు సచిన్‌ను అరెస్టు చేశారు.

పెళ్లయి 5 నెలలు.. భర్త చేతిలో హత్య

పెళ్లయి 5 నెలలు.. భర్త చేతిలో హత్య