
ధైర్యశాలి వీర మదకరి నాయక
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గకు చెందిన వీర మదకరి నాయక మహా ధైర్యశాలి అని, పోరాటం, యుద్ధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడని వాల్మీకి రాష్ట్ర ఐక్య కూటమి అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. సోమవారం వీరమదకరి నాయక జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మదకరి నాయక చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి సోదరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఒక వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి
రాజవీర మదకరి నాయక ఒక వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి అని, పులితో సైతం తలపడి పోరాడ గలిగిన ధైర్యవంతుడని కొనియాడారు. చిత్రదుర్గ కోట వాల్మీకి నాయకుల స్వాధీనంలోకి వచ్చిన తర్వాత వీరమదకరి నాయక ఎంతో ధైర్యంతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడన్నారు. కోటలో తన సైనికులకు పరివారానికి 12 సంవత్సరాల వరకు ఆహారం అందించేందుకు అప్పట్లోనే ఏర్పాట్లు చేసుకున్నారని గుర్తు చేశారు. యుద్ధంలో వీరమదకరి నాయకను ఓడించలేమని తెలుసుకున్న శత్రువులు విషం పెట్టి చంపినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయన్నారు.
వాల్మీకులకు గర్వకారణం
అలాంటి వాల్మీకి కులంలో పుట్టినందుకు వాల్మీకులు గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన అడుగు జాడల్లో మనమందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్న నేపఽథ్యంలో పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వాల్మీకి సంఘం నాయకులు మెడికల్ షాపు మల్లికార్జున, జయరాం, రూపనగుడి గోవిందు, హొన్నూరప్ప, తుకారాం, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్యకూటమి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మప్ప