
వంతెనల పనులకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత చందంగా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రూ.38 కోట్లతో చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రాయచూరు తాలూకా ఆత్కూరు–కురువపుర మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మాణాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. నది మధ్యలో 24 సిమెంట్ స్తంభాలతో దిమ్మెలను నిర్మించారు. కురువపుర నారద గడ్డ దత్తాత్రేయ స్వామి దర్శనార్థం వెళ్లడానికి సుగమమైన మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో 675 మీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి రూ.14.25 కోట్లతో శ్రీకారం చుట్టింది. 2022 నాటికి దాని వ్యయం రూ.22 కోట్లకు చేరుకుంది. కురువపుర నారదగడ్డ దత్తాత్రేయుడి దర్శనార్థం నేడు ట్రాక్టర్ల ద్వారా వెళుతున్నారు. వర్షాకాలంలో నాటు పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంది. నదిలో నీరు లేకపోతే నడుచుకుంటూ కూడా వెళుతుంటారు.
ఎమ్మెల్యే సోదరులకే కాంట్రాక్ట్.!
అర్ధంతరంగా ఆగిన వంతెన నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ను శాసన సభ్యుడి సోదరులు పొందారు. శాసన సభ్యుడికి భయపడి అధికారులు ఆగిన వంతెన నిర్మాణ పనులపై మూడేళ్ల నుంచి నోరు మెదపక పోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాయచూరు తాలూకా దొంగరాంపుర వద్ద కృష్ణానదికి అడ్డంగా 2008లో రూ.7 కోట్లతో దొంగ రాంపుర– కుర్వకుర్ద మధ్య 285 మీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినా ఫలితం లేకపోయింది. టెండర్ ప్రకటనలో నిర్లక్ష్యంతో దాని వ్యయం నేడు రూ.14 కోట్ల మేర పెరిగింది. మొత్తం రూ. రూ.21 కోట్లతో పనులు చేయడానికి కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయక పోవడంతో రెండు వంతెనల పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టిన వైనం
14 సంవత్సరాలుగా పూర్తి కాని నిర్మాణం

వంతెనల పనులకు మోక్షమెన్నడో?

వంతెనల పనులకు మోక్షమెన్నడో?