
వసతి పాఠశాలకు చిరుత ముప్పు
తుమకూరు: నగర శివార్లలోని భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలోని మూగ బధిర దివ్యాంగ విద్యార్థుల వసతి పాఠశాలలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. బెళగుంబ రోడ్డులో ఈ పాఠశాల ఉంది. ఈ పాఠశాల సమీపంలోనే కొండలు, అడవులు కూడా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి చిరుత పాఠశాల ఆవరణలోకి వస్తోంది. సోమవారం ఉదయం 9 గంటలకు పాఠశాల కార్యాలయం తాళాలు తెరుస్తున్న సమయంలో కాంపౌండ్‌లో అటుగ నడుచుకుంటూ వెళుతుండడం చూసిన పిల్లలు, టీచర్లు వెంటనే భయంతో లోపలికి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు.
అధికారుల తనిఖీ
కొండలో ఈ చిరుత, కూనలతో నివసిస్తున్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఐదారు సార్లు చిరుతను చూసినట్లు తెలిపారు. కొన్నిసార్లు కుక్కలను ఎత్తుకెళ్లి భక్షించింది. రెడ్‌క్రాస్ డైరెక్టర్ ఎస్.నాగణ్ణ, క్యాత్సంద్ర పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుత సంచరించిన గుర్తులను పరిశీలించారు. చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేస్తామన్నారు. చిరుత వల్ల పిల్లలు, టీచర్లు తీవ్రంగా భయపడుతున్నారు. ఇళ్లకు వెళ్లిపోతామని పిల్లలు చెబుతున్నారు.
విద్యార్థులు, టీచర్లకు భయం

వసతి పాఠశాలకు చిరుత ముప్పు