
ఘన పయనం
గజ సార్వభౌముల
ఏ ఏనుగులు వచ్చాయంటే
గజపయన కోలాహలం
మైసూరు: ప్రతి ఏటా వైభవోపేతంగా నిర్వహించే విశ్వ విఖ్యాత దసరా ఉత్సవాలకు తొలి అడుగు పడింది. అటవీ శిబిరం నుంచి గజరాజు అభిమన్యు నేతృత్వంలో ఏనుగులు సోమవారం నగరానికి బయలుదేరాయి. హుణసూరు తాలూకా వీరనహొసహళ్లిలో అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు గజరాజులకు ఘనంగా పూజలు నిర్వహించి గజ పయనానికి శ్రీకారం చుట్టారు.
మైసూరు రాజ ప్రసాదం అర్చకుడు ప్రహ్లాద్ రావ్ నేతృత్వంలో అర్చకులు 9 ఏనుగులకు పాదాలు కడిగి , పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి, చెరుకు, బెల్లం, అరటిపండ్లు, వివిధ రకాల తినుబండారాలు నైవేద్యంగా సమర్పించారు. మధ్యాహ్నం 12.30 నుంచి 12.59 మధ్య గంటల మధ్య శుభ తులా లగ్నంలో ఏనుగులను పూజలు చేసి, దిష్టి తీసి గజ పయనాన్ని ప్రారంభించారు. ఊరేగింపులో వీరగాసె, జానపద కళాకారుల ప్రదర్శనల కోలాహలం మిన్నంటింది. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. విశేష ప్రతిభ కనపర్చిన మావటీలకు అర్జున పేరుతో అవార్డులు అందించారు.
సఫారీలో వన్యజీవులు, దసరా జంబూ సవారీలో అలంకృత ఏనుగులను చూసి ఆనందించయే మనం వాటి సంరక్షణకు కూడా ముందుకు రావాలని మంత్రి ఈశ్వర ఖండ్రే ఈ సందర్భంగా కోరారు. ప్రకృతి సమతౌల్యానికి వన్యజీవులు ఎంతో అవసరం, వాటి రక్షణకు మనమందరం కట్టుబడాలన్నారు. అక్రమంగా విద్యుత్ తీగలను పొలాల వద్ద వేయడం వల్ల కరెంటు షాక్‌తో ఏనుగులు మరణిస్తున్నాయి. వలల్లో చిక్కి పులులు, చిరుతలు చనిపోతున్నాయి. మలె మహదేశ్వర కొండ అడవిలో ఐదుపులులు విషాహారం వల్ల చనిపోయాయి అని వాపోయారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కుందన్నారు. వన్య జీవుల స్థలాలను ఆక్రమించిన మనం వాటిని చంపకుండా సంరక్షణ చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పశువులను తెచ్చి మన రాష్ట్ర అటవీ ప్రాంతంలో మేపుతుండడం వల్ల వన్య జీవులకు అడవులలో ఆహారం కరువైందని చెప్పారు.
అందువల్ల పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పశువులను నిషేధిస్తామని తెలిపారు. ఏనుగుల సంరక్షణ కోసం రైలు పట్టాల వెంబడి బారికేడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అటవీ సంపదను రక్షిస్తున్న ఆదివాసీలు, అరణ్యవాసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మంత్రి కె వెంక టేష్, ఎమ్మెల్యేలు హరీష్‌గౌడ, తన్వీర్ సేట్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
గజ పయనం ఆరంభం
9 ఏనుగుల రాక
మైసూరు దసరా ఉత్సవాలకు సన్నాహాలు
వన్యజీవులను కాపాడుకోవాలి
7న ప్యాలెస్‌కు రాక
కాళ్లు కడిగి..
కెప్టెన్ అభిమన్యు (59 ఏళ్లు), భీమ (25), కంజన్ (24), ధనంజయ (44), ప్రశాంత్ (53), మహేంద్ర (42), ఏకలవ్య (40), కావేరి (45), లక్ష్మీ (53) గజరాజులు వచ్చాయి. కొంతదూరం ఊరేగింపులో నడిచాక, ప్రత్యేక లారీలలో ఏనుగులను మైసూరులోని అటవీ భవనానికి తరలించారు.
ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 12.06 నుంచి 12.30 మధ్యన శుభ తులా లగ్నంలో రాజప్రసాదం జయమార్తాండ ద్వారం నుంచి ఏనుగులు రాజ ప్రసాదంలోనికి ప్రవేశిస్తాయి. మైసూరు అరమనె మండలి, జిల్లా అధికారులు సంప్రదాయ స్వాగతం పలుకుతారు. రాజప్రపాదంలో ఆవరణలోని షెడ్లలో ఏనుగులు, మావటీల కుటుంబాలు బస చేస్తాయి. మరో 5 ఏనుగులు త్వరలోనే చేరుకుంటాయి.

ఘన పయనం

ఘన పయనం

ఘన పయనం