
కేఆర్‌ఎస్‌ను టిప్పు నిర్మించారా?
● మంత్రిపై విజయేంద్ర ధ్వజం
దొడ్డబళ్లాపురం: మైసూరు చరిత్ర తెలిసి కూడా మంత్రి మహదేవప్ప చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. బెంగళూరు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టిప్పు సుల్తాన్ కన్నంబాడి కట్ట (కృష్ణరాజ సాగర డ్యాం)కు శంకుస్థాపన చేశారని చెప్పి మైసూరు మహారాజులను మంత్రి అవమానించారన్నారు. గతంలో కూడా సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేతలు మైసూరు మహారాజులను కించపరిచారన్నారు. 1799లో టిప్పు సుల్తాన్ యుద్ధంలో చనిపోయాడని, 1902 తరువాత కేఆర్‌ఎస్ డ్యాం నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. డ్యాం కట్టడానికి డబ్బులు లేక మైసూరు మహారాజు భార్య బంగారు నగలు ముంబైకి తీసికెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకొచ్చిన చరిత్ర అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ నాయకులు ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇలా మాట్లాడడం తగదన్నారు.
మఠ సారథ్యానికి మత భేదం
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి గ్రామంలో కొత్తగా నిర్మాణం అయిన గురుమల్లేశ్వర విరక్త మఠానికి యాదగిరి జిల్లా సహపుర గ్రామానికి చెందిన నిజలింగ స్వామిని మఠాధిపతిగా నియమించారు. అయితే ఆయన డాక్యుమెంట్లను పరిశీలించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆధార్‌కార్డు, మార్కుల జాబితాలు, పాన్ కార్డులను పరిశీలిస్తే అందులో అతని పేరు మహ్మద్ నిసార్‌గా ఉంది. స్వామిని ప్రశ్నించగా తాను ముస్లింగానే జన్మించానని, అయితే లింగదీక్ష చేసుకున్నానని తెలిపాడు. కానీ గ్రామస్తులు , మఠ నిర్వాహకులు ఆయనను అంగీకరించక వెనక్కి పంపించారు. కాగా, నిస్సార్ చిన్ననాటి నుంచే బసవణ్ణ తత్వ చింతనలకు ప్రభావితుడై జంగమ దీక్ష తీసుకుని బసవతత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది.