
శివమొగ్గలో ప్రదర్శనకు యుద్ధ విమానం
శివమొగ్గ: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాన్ని శివమొగ్గ నగరానికి తీసుకొచ్చారు. ఫ్రీడంపార్కు ఆవరణలో దీనిని ఉంచారు. ఇటీవలే ఈ పార్కులో యుద్ధ ట్యాంకును కూడా ఉంచారు. లోక్‌సభ ఎంపీ బీవై రాఘవేంద్ర యుద్ధ విమానాన్ని వీక్షించారు. 1960లో దీనిని తయారు చేసినట్లు, 2023లో ఈ విమానం రిటైరైందని, దీనిని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని చెప్పారు. ముక్కలుగా ఉన్న విమానాన్ని పూర్తిగా అతికించి సిద్ధం చేయనున్నారు.
గంధం కాయలు
తిని బాలలకు అస్వస్థత
మైసూరు: శ్రీగంధం కాయలు తిని 12 మంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా యరియూరు గ్రామంలో జరిగింది. కూలీ పనుల కోసం మహారాష్ట్రకు చెందిన కార్మికులు యళందూరు తాలూకా వివిధ గ్రామాలకు వచ్చారు. యళందూరులో టెంట్ వేసుకుని జీవిస్తున్నారు. వారి పిల్లలు రోడ్డుపక్కన పడి ఉన్న గంధం కాయలను పండ్లుగా భావించి తినగానే వాంతులు కనిపించాయి. వెంటనే తల్లిదండ్రులు యళందూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చామరాజనగర జిల్లాస్పత్రికి తరలించారు.
పురిట్లో తల్లీ బిడ్డ మృతి
మైసూరు: చామరాజనగర జిల్లాస్పత్రిలో ప్రసవం కోసం వచ్చి బాలింత, పసిగుడ్డు మరణించారు. ఈ విషాదంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాలు.. బసప్పనపాళ్య గ్రామానికి చెందిన భాగ్య (30)కు నెలలు నిండడంతో కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ప్రసవం చేస్తామని వైద్యులు తెలిపారు. రాత్రి ప్రసవ సమయంలో తల్లి, కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఘోరం జరిగిపోయిందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం వల్ల తల్లీబిడ్డా మరణించారని వైద్యులు తెలిపారు.
జ్వరానికి ఇద్దరు
బాలల బలి
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హెస్టల్ గ్రామంలో తీవ్రమైన జ్వరంతో ఇద్దరు బాలలు మరణించారు. మూడిగెరె వ్యవసాయ శాఖలో డ్రైవర్‌గా పని చేస్తున్న రవి–పల్లవి దంపతుల కూతురు ప్రేరణ (11), కూలీ కార్మికుడు బసవరాజ్–మంజుళ కూతురు సారా (9) మృతులు. ప్రేరణ 6, సారా 4వ తరగతి చదివేవారు. వారంరోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. వైద్యుల సూచనల మేరకు చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక చనిపోయారు. వైద్యాధికారులు గ్రామానికి వైద్యులను పంపి జ్వర బాధితులకు వైద్య చికిత్సలు నిర్వహించారు. జ్వరం వస్తే భయపడవద్దని తెలిపారు. గ్రామంలో విషజ్వరాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

శివమొగ్గలో ప్రదర్శనకు యుద్ధ విమానం