వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Aug 3 2025 8:12 PM | Updated on Aug 3 2025 8:12 PM

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

హొసపేటె: గదగ్‌ తాలూకాలోని లక్కుండి గ్రామానికి చెందిన మైలారప్ప అనే 54 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మైలార కార్ణిక దర్శనానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యమైన ఘటనపై హిరేహడగలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 5.6 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, జిడ్డు చర్మం కలిగి మాట్లాడలేడు, వినలేడు( మూగ, చెవిటి) అని తెలిపారు. మాట్లాడనప్పుడు చేయి, నోటితో సైగ చేస్తాడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తెల్లటి ధోతి, తెల్లటి నిండు చేతుల చొక్కా ధరించాడు. తప్పిపోయిన వ్యక్తి గురించి ఏదైన సమాచారం ఉంటే హిరేహడగలి పోలీస్‌ స్టేషన్‌ కంట్రోల్‌ రూమ్‌ లేదా 08394–200202, 9480805700కు సమాచారం అందించాలని ఆ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ ప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

హొసపేటె: నగరంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హొసపేటె అర్బన్‌ డివిజన్‌లోని 33/11 కేవీ విద్యుత్‌ సరఫరా కేంద్రంలో మరమ్మతు పనులు చేపడుతున్నందున విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జెస్కాం ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (అర్బన్‌ డివిజన్‌) ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కే.సతీష్‌ తెలిపారు. విద్యుత్‌ ఉప కేంద్రం పరిధిలోని బసవేశ్వర బడావణె, డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సర్కిల్‌, డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సర్కిల్‌, రాజీవ్‌నగర్‌, రైల్వేస్టేషన్‌, అమరావతి, చిత్తవాడిగి, షుగర్‌ ఫ్యాక్టరీ, హంపీ రోడ్డు, గణేష్‌గుడి, నౌకర్‌ కాలనీ, గాంధీ సర్కిల్‌, బస్టాండ్‌, మెయిన్‌ బజార్‌, కోర్టు, రాణిపేట, భట్రహళ్లి, బెనకపుర, బసవనదుర్గ, నాగేశహళ్లి, నరసాపుర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు, ప్రజలు సహకరించాలని జెస్కాం ఓ ప్రకటనలో కోరింది.

విద్యుత్‌ పరికరాల చోరీ

హుబ్లీ: బిన్నాళ విద్యుత్‌ ఉప కేంద్రంలో భద్రపరిచిన రూ.40 వేలు విలువ చేసే విద్యుత్‌ పరికరాలను దుండగులు చోరీ చేశారు. సదరు కేంద్రంలో రెండు ఐసోలేటర్లు, రెండు కాపర్‌ బ్లేడ్లు, మూడు అర్త్‌ స్విచ్‌ కాపర్‌ బ్లేడ్లు చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బెండిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఏటీఎం దోపిడీకి యత్నం.. నిందితుల అరెస్టు

సాక్షి, బళ్లారి: నగరంలోని తాళూరు రోడ్డులోని రెడ్డి హోటల్‌ సమీపంలో రెండు రోజుల క్రితం ఎస్‌బీఐ బ్యాంక్‌ ఏటీఎంలో నగదును దొంగలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శోభారాణి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి నగరానికి చెందిన అవినాష్‌(27), శివరాజ్‌(29) అనే ఇద్దరు ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి నగదు తొంగతనానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ ఘటనపై గ్రామీణ పోలీస్టేషన్‌లో కేసు నమోదు కావడంతో డీఎస్పీ నందారెడ్డి, సిరుగుప్ప డీఎస్పీ సంతోష్‌ చౌహాన్‌ నేతృత్వంలో పోలీసు బృందాలు తనిఖీ చేసి 30 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సీసీబీ, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పకడ్బందీగా పని చేయాలని సూచించారు.

పార్టీలో అసమ్మతికి తెరదించండి

రాయచూరు రూరల్‌ : రాయచూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న భిన్నాభిప్రాయాలకు తెరదించాలని కేపీసీసీ వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు టీ.మారెప్ప అధిష్టానాన్ని కోరారు. శనివారం ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇంచార్జి మంత్రి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ను పక్కకు తోసి అధికారులను, ఉద్యోగులను తమ చేతుల్లో పెట్టుకొని సర్వాధికార ధోరణిని అవలంబిస్తూ రాజకీయ పక్షపాతంతో అధికారం చెలాయిస్తూ తమదే పైచేయి కావాలంటు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు, ఆయన కుమారుడు రవి బోసురాజు ఏక చత్రాధిపత్యం చేస్తూ ఇతర కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీలో ముసలం ముదిరి పోయిందన్నారు. ఇష్టారాజ్యం చలాయిస్తూ తామే చక్రం తిప్పాలంటూ మంత్రి పాటిల్‌ను దూరంగా ఉండాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. పార్టీలో గుంపులుగా గుర్తింపు పొందిన వారికి బోసురాజు పదవులు కట్టబెడుతున్నారన్నారు. జిల్లాకు వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.

ఎయిమ్స్‌ ఏర్పాటుకు ససేమిరా

రాయచూరు రూరల్‌: రాయచూరులో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి ఆందోళన చేపట్టినా కేంద్ర ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోలేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యదర్శి రజాక్‌ ఉస్తాద్‌ ఆరోపించారు. ఆయన ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ సభ్యులు కుమార నాయక్‌, తుకారాం లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జాధవ్‌ను ప్రశ్నించగా కర్ణాటకకు ఎయిమ్స్‌ మంజూరు చేయలేదని వారివురి ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో చేతులు దులుపుకుందని తెలిపారు. రాయచూరు మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో చేపట్టిన ఆందోళన గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రానికి లేఖలు రాసి, కమిటీ సభ్యులు వెళ్లి మంత్రులను, ఎంపీలను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయిందని, కేంద్రం కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ఒలకబోసిందని తెలిపారు.

విమానాశ్రయం పనుల పరిశీలన

రాయచూరు రూరల్‌: రాయచూరు విమానాశ్రయం వద్ద చేపట్టిన పనులను జిల్లాధికారి నితీష్‌ పరిశీలించారు. శుక్రవారం యరమరస్‌ వద్ద విమానాశ్రయ ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. రక్షణ గోడ, ప్యాసింజర్‌ టర్మినల్‌ భవనం, రన్‌వే, సీఆర్‌పీఎఫ్‌, ఏటీసీ వసతి గృహాలు, మాస్టర్‌ ప్లాన్‌ గురించి కాంట్రాక్టర్‌తో సమీక్షించారు. త్వరితగతిన పనులను నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement