
రేషన్ కష్టాలు తీరేదెన్నడో?
హుబ్లీ: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొని రాష్ట్ర పాలన చేపట్టి రెండేళ్లు గడిచినా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సరుకులు ప్రతి నెల వాటిని పొందడానికి ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కాదు. ముఖ్యంగా హావేరి, ధార్వాడ జిల్లా అలాగే మిగతా చోట్ల ప్రతి నెల గడువులోగా అందాల్సిన రేషన్ బియ్యం ఇంకా అందలేదు. దీంతో చౌక డిపో డీలర్ జిల్లా కేంద్రం హావేరికి వచ్చి వీలైనంత త్వరలో బియ్యం, జొన్నలు పంపమని ఆహార పౌర సరఫరా అధికారులను వేడుకున్నారు. ప్రతి నెలా గడువులోగా అందాల్సిన రేషన్ బియ్యం, జొన్నలు ఈసారి హావేరి జిల్లా సంబంధిత శాఖకు రాలేదు. దీంతో రోజు వినియోగదారులు అడిగే ప్రశ్నలకు విసుగు కలుగుతుందని చౌకడిపో డీలర్లు వాపోతున్నారు. సదరు గోడౌన్‌కు 15 రోజుల నుంచి ప్రదక్షణలు చేసినా పూర్తి స్థాయి రేషన్ సరుకులు డీలర్లకు అందలేదు. కొన్ని చోట్ల అంగళ్లకు 75 శాతం బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయడంతో వాటిని వినియోగదారులకు పంచడానికి ఏమీ పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.
వేధిస్తున్న కొత్త తంబ్ ఇంప్రెషన్ సమస్య
కొత్త తంబ్ ఇంప్రెషన్ సమస్యతో రేషన్ కార్డు ఉన్నా పంపిణీ సమస్య ఏర్పడుతోంది. అన్న భాగ్య యోజన ద్వారా కేంద్ర సర్కారు నుంచి రావాల్సిన 75 శాతం రేషన్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 25 శాతం రేషన్ బియ్యం రాలేదని ఆ జిల్లా ఆహార పౌర సరఫరా శాఖ డీడీ రమేష్ తెలిపారు. జిల్లాలో అన్నభాగ్య యోజన ద్వారా 64,150 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతుంది. అయితే గత నెల 48,112 క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా అయింది. 16,037 క్వింటాళ్ల బియ్యం పెండింగ్‌లో ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణం. ప్రభుత్వం నిధుల విడుదలతోనే ఎస్‌సీఐసీఎం విడుదల చేస్తుంది. మరి కొన్ని రోజుల్లో వినియోగదారులకు రేషన్ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. తంబ్ ఇంప్రెషన్ విషయం సాంకేతిక సమస్య గతంలో బయోమెట్రిక్ తీసుకొనే వారు, ఈ సారి ఆన్‌లైన్‌లో అందరు కుటుంబ సభ్యులు ఉంటే మాత్రమే పంపిణీ చేయడానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. హావేరి జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు.
సరుకుల కోసం ఎదురు చూపులు
చౌక డిపోల్లో ప్రజలకు తప్పని పాట్లు