
వ్యసన రహిత సమాజాన్ని నిర్మిద్దాం
హొసపేటె: డాక్టర్ మహంత శివయోగి తన సంచిలో ప్రజల దుర్గుణాలను భిక్ష రూపంలో సేకరించి వ్యవస రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మహంత శివయోగి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన మాట్లాడారు. వ్యసన రహిత సమాజం గురించి కలలు కన్న డాక్టర్ మహంత శివయోగ స్వామీజీ 1975 నుంచి సామాజిక విప్లవానికి నాంది పలికారన్నారు. మహంత జోళిగె కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. మద్యపానంతో సహా వ్యసనాలు ఒక వ్యక్తిని శ్మశాన వాటికకు ఆహ్వానించడం లాంటివని ఆయన ప్రజల్లో అవగాహన కల్పించారు. మహంత శివయోగి దేశంలోనే కాకుండా ఇంగ్లండ్‌తో సహా వివిధ విదేశాల్లో కూడా జోళిగె నిర్వహించి వ్యసనాల విముక్తి కోసం ప్రజలను వేడుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస రహిత దినోత్సవంగా జరుపుతోందన్నారు. కార్యక్రమంలో మనోజ్, ప్రియదర్శిని, సమాచార శాఖ సిబ్బంది రామాంజనేయ, అశోక్ ఉప్పార, పీ.కృష్ణస్వామి, తాహేష్, కిషోర్, తిప్పేష్, దేవరాజ్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సిబ్బందితో సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.