
బావ చేతిలో బామ్మర్ది హతం
సాక్షి,బళ్లారి: తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భార్య తమ్ముడు, బామ్మర్దిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన బళ్లారి తాలూకా ఎత్తినబూదిహాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బసయ్య అనే వ్యక్తి తన బామ్మర్దిని దారుణంగా హత్య చేశాడు. 16 ఏళ్ల క్రితం బసయ్య అదే గ్రామానికి చెందిన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రం కావడంతో పాటు నిత్యం మద్యం తాగి వచ్చి, భార్యను వేధించడంతో పాటు, ఆమె శీలాన్ని నిత్యం శంకించడంతో భార్య విసిగిపోయింది. నిత్యం వేధించడం, హింస పెడుతున్న నేపథ్యంలో తమ్ముడితో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపోద్రీక్తుడైన బసయ్య శుక్రవారం రాత్రి బామ్మర్ది ఇంటికి వెళ్లి గొడవ పడి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఎత్తినబూదిహాల్ గ్రామంలో కలకలం సృష్టించింది.
గ్రామానికి అధికారుల దండు
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్‌తో పాటు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండటంతో సోదరి తరపున పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మహేష్‌ను హత్య చేయడంపై గ్రామస్తులు నిందితుడిపై మండిపడుతున్నారు. కుటుంబ గొడవలకు బామ్మర్ది బలై పోయాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అని హత్య
ఘటనతో ఎత్తినబూదిహాళ్ గ్రామంలో కలకలం

బావ చేతిలో బామ్మర్ది హతం