
బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం
బళ్లారి అర్బన్: జాతిపిత మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులతో శభాష్ అనిపించుకున్న బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం అని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నాగరాజు పేర్కొన్నారు. శనివారం రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 145వ జయంతి సందర్భంగా రాఘవ కళా మందిరం ముందు ఉన్న రాఘవ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. కన్నడ, తెలుగు భాషల్లోనే కాకుండా ఇంగ్లిష్‌లో అపారమైన వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే ఆజానుబాహుడని కొనియాడారు. ముఖ్యంగా రచయిత షేక్‌స్పియర్ రచించిన నాటకాల పాత్రలలో రంజింపజేయడం, ఇంగ్లిష్ సంభాషణను పలికే తీరు బళ్లారి రాఘవకు అఖండ ఖ్యాతి దక్కేలా చేసిందన్నారు.
కన్నడిగుల గుండెల్లో చిరస్థాయిగా రాఘవ
అనంతరం రంగభూమి అనుష్యా రత్న బళ్లారి రాఘవ పుస్తకాన్ని రచించిన సిద్దరామ కల్మఠ్ మాట్లాడుతూ బళ్లారి రాఘవ తెలుగు నాటకాల్లో నటించినా కన్నడిగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రిజిస్ట్రార్ నాగరాజ్ రాఘవ రంగ పుస్తకాన్ని రచించిన సిద్దరామ కల్మఠను సన్మానించారు. అనంతరం బెంగళూరుకు చెందిన కళాకారుడు డింగ్రి నాగరాజ్‌కు బళ్లారి రాఘవ ప్రశస్తిని అందించి ఘనంగా సత్కరించారు. కళా సంగమ సంస్థ ధార్వాడ బృందంచే వీరేష్ బాగలకోట రచించిన, దర్శకుడు ప్రభు హంచనాళ్ దర్శకత్వంలో సమరసింహ సంగొళ్లి రాయణ్ణ కన్నడ చారిత్రక నాటకం అందరినీ ఆలరించింది. బళ్లారి రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు కే.చెన్నప్ప, పదాధికారులు రమేష్ గౌడ పాటిల్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్.ప్రకాష్, పీ.ధనుంజయ, ఎం.రామాంజినేయులు తదితర ప్రముఖులు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.
వీఎస్కేయూ రిజిస్ట్రార్ నాగరాజు
ఘనంగా 145వ జయంతి వేడుక

బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం

బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం