వాన నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి
బళ్లారి రూరల్ : వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో నగరంలో రోడ్లపైన, కాలనీల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ సూచించారు. దావణగెరె జిల్లాధికారి కార్యాలయంలోని సభాభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పూర్తి కాని రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అండర్‌పాస్, సర్వీసు రోడ్లను నిర్మించి సంచారానికి వీలు కల్పించాలన్నారు. నగరంలోని ఎస్‌ఎస్ హైటెక్ ఆసుపత్రి ప్రధాన రోడ్డు ముఖద్వారం 48వ జాతీయ రహదారి చైనేజ్ అండర్ పాస్ ద్వారా బస్సులు, కార్లు, వాహనాల సంచారం అధికంగా ఉంటుంది. ఇక్కడ వంతెనలు చిన్నవిగా ఉన్నాయి. ఈ విషయంపై జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ అధికారులతో చర్చిస్తానన్నారు. నగరంలో ఆటోలకు తప్పనిసరిగా మీటర్లు, డిస్‌ప్లే అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను రక్షించడానికి ప్రతి 70 కి.మీ.కు ఒక అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఇంజినీరు నరేంద్రబాబు, డీఎస్పీ విజయకుమార్ ఎం.సంతోష్, దుడా ప్రణాళికా సంచాలకుడు మహంతేశ్, నియంత్రణాధికారి ఫక్రుద్దీన్, డీహెచ్‌ఓ డాక్టర్ షణ్ముకప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.


