సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శ్రీవిద్య అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శ్రీవిద్య అనుమానాస్పద మృతి

Sep 6 2023 1:22 AM | Updated on Sep 6 2023 11:17 AM

- - Sakshi

ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే సర్వం అని ఆ యువతి అతని వెంట నడచింది. వివాహం జరిగి ఆరు నెలలు కూడా తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.

కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే సర్వం అని ఆ యువతి అతని వెంట నడచింది. వివాహం జరిగి ఆరు నెలలు కూడా తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కన్నవాళ్లు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల దళితవాడకు చెందిన నరసింహులు, ఉషారాణి దంపతుల కుమార్తె శ్రీవిద్య (22) మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. నీరుగంటివారిపల్లిలో కాపురం ఉండే మల్లీశ్వరి, మారపరెడ్డి దంపతుల కుమారుడు విజయ్‌ కుమార్‌రెడ్డి (23)తో కాలేజీ రోజుల్లోనే ప్రేమ మొదలైంది. యువకుని కుటుంబీకులు అడ్డుచెప్పినా ఇద్దరూ ఈ ఏడాది మార్చి నెలలో మదనపల్లిలోని ఓ ఆలయంలో దండలు మార్చుకుని అనంతరం అక్కడే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెళ్లి నమోదు చేసుకున్నారు.

బెంగళూరులో కాపురం
తరువాత బెంగళూరులోని మునిరెడ్డిపాళ్యలో కాపురం పెట్టారు. యువతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటుండగా యువకుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం ఏం జరిగిందో ఏమో శ్రీవిద్య ఇంట్లోనే మంచంపై శవమై తేలింది. విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రులు మృతదేహాన్ని సోమవారం మల్లెలదళితవాడకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనేది అక్కడి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement